- లోకల్‌గా తయారీ, స్టోర్లు ఓపెన్ చేయడంతో ఈ బ్రాండ్‌కు ఆదరణ
- ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ, మహీంద్రా టాప్
- ధర ఎక్కువగా ఉండడంతో గిరాకీ నిల్
న్యూఢిల్లీ: ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విస్తరిస్తోంది. ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఏడాది భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్, అమెరికన్ కంపెనీ టెస్లా వేర్వేరు స్ట్రాటజీలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. విన్‌ఫాస్ట్, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తమ కార్లను ప్రదర్శించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 6న వీఎఫ్6, వీఎఫ్7 ఎస్‌యూవీలను రూ.16.49–రూ.25.49 లక్షల ధరల వద్ద విడుదల చేసింది.
ఈ ఏడాది అక్టోబర్‌లో 131 వాహనాలు విక్రయించింది. ప్రభుత్వ వెహికల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ వాహన్ ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 204 రిజిస్ట్రేషన్లు సాధించింది. తమిళనాడులో ఫ్యాక్టరీ, 27 నగరాల్లో 35 షోరూమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ బ్రాండ్ గుర్తింపు పెరిగింది. విన్‌ఫాస్ట్ లోకల్‌గా ఈవీలను తయారు చేసి, తక్కువ రేట్లకే కార్లను అమ్ముతోంది.
నెమ్మదించిన టెస్లా
మరోవైపు టెస్లా పూర్తిగా దిగుమతులపై ఆధారపడి అమ్మకాలు జరుపుతోంది. ఈ ఏడాది మధ్యలో మోడల్ వై ద్వారా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ, అక్టోబర్‌లో కేవలం 40 కార్లే అమ్మగలిగింది. ప్రస్తుతం టెస్లా ఒక్క మోడల్ వై కారునే అమ్ముతుండగా, దీని ధర రూ.59.89–రూ.67.89 లక్షల వద్ద ఉంది. టెస్లా ఇంకా లోకల్‌గా అసెంబ్లింగ్ ప్రారంభించలేదు. కంపెనీ స్టోర్లు కూడా ముంబై, ఢిల్లీకే పరిమితమయ్యాయి. దీంతో విన్‌ఫాస్ట్ మాదిరి వేగంగా విస్తరించలేకపోతోంది.
టెస్లా “ఇంపోర్ట్ ద్వారా మాత్రమే అమ్మకాలు” జరుపుతోందని కేంద్ర ప్రభుత్వం గతంలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. జీఎస్‌టీ మార్పులతో పెట్రోల్, డీజిల్ బండ్లపై పన్ను తగ్గినప్పటికీ, ఈవీలపై 5శాతం కొనసాగుతోంది. దీంతో జీఎస్‌టీ 2.0 ప్రభావం ఎలక్ట్రిక్ బండ్లపై లేదు. దీంతో రేట్లు తగ్గలేదు. మరోవైపు హ్యుందాయ్, మారుతి, కియా, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలు కూడా లోకల్‌గా ఈవీ సేల్స్ పెంచుకోవడానికి కొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నాయి.
ఈవీ జోష్
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్ 18,055 యూనిట్లకు చేరుకున్నాయి. 2024 అక్టోబర్‌తో పోలిస్తే 57.5శాతం వృద్ధి నమోదైంది. 2023 అక్టోబర్‌లో 11,464 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరిగాయి. కిందటి నెలలో టాటా మోటార్స్ 7,239 ఎలక్ట్రిక్ కార్లు అమ్మగా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ 4,549 కార్లు, మహీంద్రా 3,911 కార్లు అమ్మాయి. ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ కూడా అక్టోబర్‌లో 105.9శాతం పెరగడం విశేషం.
