నర్సన్న సన్నిధిలో కార్తీక సందడి..ఒక్కరోజే కోటి రూపాయల ఆదాయం

నర్సన్న సన్నిధిలో  కార్తీక సందడి..ఒక్కరోజే కోటి రూపాయల  ఆదాయం
  • యాదగిరిగుట్ట, పాతగుట్టలో కలిపి ఒక్కరోజే 1,958 సత్యనారాయణ వ్రతాలు
  • స్వామి వారి ధర్మదర్శనానికి 5, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం
  • ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.1.57 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. కార్తీకమాసానికి తోడు ఆదివారం కావడంతో హైదరాబాద్‌‌‌‌ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో దర్శన, ప్రసాద క్యూలైన్లు, ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి ధర్మదర్శనానికి ఐదు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భారీ సంఖ్యలో వాహనాల రాకతో రింగ్‌‌‌‌ రోడ్డు, ఆలయ ఘాట్‌‌‌‌ రోడ్డులో ట్రాఫిక్‌‌‌‌కు ఇబ్బందులు తలెత్తాయి. రద్దీ కారణంగా పలువురు చిన్నారులు తప్పిపోగా.. వారిని ఎస్పీఎఫ్‌‌‌‌ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఒక్కరోజే 1,958 సత్యనారాయణ వ్రతాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భారీ సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. యాదగిరిగుట్టలో 1,758, పాతగుట్టలో 200 కలిపి మొత్తం 1,958 వ్రతాలు జరిగినట్లు ఆఫీసర్ల తెలిపారు. వ్రతాలు జరిపించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వ్రత టికెట్ల క్యూలైన్లు నిండి ఘాట్‌‌‌‌ రోడ్డు సర్కిల్‌‌‌‌ వరకు బారులుదీరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏడు బ్యాచ్‌‌‌‌లలో వ్రతాలు నిర్వహించారు. మరో వైపు కొండపైన ప్రధానాలయం, శివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపారాధన మండపాల్లో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

రికార్డు స్థాయిలో రూ.1.57 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కారణంగా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ. 1,00,57,322 ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.27,43,220, వ్రతాల ద్వారా రూ.19.58 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.16.95 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.9.17 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.8,01,600 ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకట్‌‌‌‌రావు వెల్లడించారు.