ఇప్పపువ్వు లడ్డూలు.. మస్త్ ఫేమస్! అమ్మకాలతో ఏటా రూ.1.27 కోట్ల టర్నోవర్.. సాధిస్తున్న భీమ్ బాయి మహిళా సంఘం

ఇప్పపువ్వు లడ్డూలు..  మస్త్ ఫేమస్! అమ్మకాలతో ఏటా రూ.1.27 కోట్ల టర్నోవర్.. సాధిస్తున్న భీమ్ బాయి  మహిళా సంఘం
  • స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న భీమ్​బాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం
  • రూ.40 లక్షలతో లడ్డూల తయారీ యూనిట్ నెలకొల్పిన సర్కారు
  • నెలకు రూ.3 లక్షల ఆదాయం పొందుతున్న మహిళలు

హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ మహిళలు తయారుచేసే ఇప్పపువ్వు లడ్డూలు ఇప్పుడు మస్త్ ఫేమస్ అయ్యాయి. ఎక్కడో ఆదివాసీ గిరిజన ప్రాంతాలకే పరిమితం అయ్యే ఈ లడ్డూలు.. ఇప్పుడు హైదరాబాద్ నగర వీధుల్లో దొరుకుతున్నాయి.  దీని వెనుక భీమ్ బాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం కృషి ఉన్నది. 

సర్కారు ప్రోత్సాహంతో లడ్డూల తయారీ, అమ్మకాలపై  ఏటా రూ.1.27 కోట్ల టర్నోవర్​ చేస్తున్నారు. నెలకు రూ.3 లక్షల ఆదాయం పొందుతూ ఇతర మహిళా సంఘాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మహిళల కృషిని, ఆర్థిక స్వావలంబన గురించి ‘మన్ కీ బాత్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రస్తావించారు. ఉట్నూర్ లో పర్యటించిన సందర్భంగా ఆదివాసీ మహిళా సాధికారతను తెలుసుకున్న మంత్రి సీతక్క, ఆదివాసీ మహిళలను అభినందించారు.

రూ.40 లక్షల ఖర్చుతో లడ్డూల తయారీ యూనిట్

ఆదివాసీ గిరిజనుల జీవన విధానంలో అత్యంత పోషక విలువలున్న ఇప్పపువ్వు కు చాలా విశిష్ఠత ఉంది. ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన మహిళల ఆర్థిక అభ్యున్నతికి చేయూతనిచ్చింది. అందులో భాగంగా వీరికి సంపూర్ణ ఆర్థిక అవసరాలు తీర్చేలా ఉట్నూర్ ఐటీడీఏ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా కృషి చేస్తున్నది. 

ఆర్థిక అక్షరాస్యత కలిగిన 12 మంది ఆదివాసీ గిరిజన మహిళలు గుర్తించి వారికి ప్రకృతిసిద్ధంగా లభిస్తున్న ఇప్పపువ్వుతో లడ్డూల తయారీపై మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు పంపి శిక్షణ ఇప్పించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైకార్ విభాగం నుంచి ఉట్నూర్ లో రూ.40 లక్షల వ్యయంతో ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్ నెలకొల్పారు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీగా 60%, బ్యాంక్​లోన్ 30%, మహిళల వాటాగా 10% ఉంది.

కిలోకు రూ.320 నుంచి రూ.360

ఆదివాసీ గిరిజన మహిళలు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్​ఐఎన్​) నిపుణులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఇప్పపువ్వు లడ్డూల తయారీ చేపడ్తున్నారు. ఇప్పపువ్వు కు పల్లీలు, నువ్వులు, బెల్లం, కాజు, ఎండు ద్రాక్ష ను కలిపి సన్ ఫ్లవర్ ఆయిల్ తో రుచికరమైన లడ్డూలు తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది మార్చిలో లభించే ఇప్పపువ్వును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల నుంచి దాదాపు 150 క్వింటాళ్లను సేకరించి ఐటీడీఏ గోడౌన్ లో నిల్వ చేస్తున్నారు. 

దాదాపు 100 కుటుంబాలు ఇప్పపువ్వు సేకరణ ద్వారా లబ్ధిపొందుతున్నాయి. గిరిజన పోషణ మిత్ర పథకం కింద పోషక విలువలున్న ఇప్పపువ్వు లడ్డూలను ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 77 ఆశ్రమ పాఠశాలలకు ప్రతి నెలా 2,300 కిలోలను సరఫరా చేస్తున్నారు. ఓపెన్ మార్కెట్​లో ప్రతి నెలా 900 కిలోల లడ్డూలు విక్రయిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలకు కిలో రూ.320 చొప్పున, ఓపెన్ మార్కెట్ లో కిలో రూ.360 చొప్పున 
అమ్ముతున్నారు.

ఏటా రూ.1.27 కోట్ల టర్నోవర్​ 

హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రం, బాలాపూర్ లో లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. శిల్పారామంలో వారానికి 15 కిలోలు, బాలాపూర్ లో వారానికి 25 కిలోల లడ్డూలు అమ్ముడుపోతున్నాయి. ఆదివాసీ గిరిజనులే ఇక్కడ ఇప్పపువ్వు లడ్డూలు అమ్ముతున్నారు. అలాగే, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా దర్భార్ సందర్బంగా ఐటీడీఏ ప్రాంగణంలో ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పపువ్వు లడ్డూల తయారీ, విక్రయం ద్వారా ఏడాదికి రూ.1.27 కోట్ల టర్నోవర్ సాధించినట్లు భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం నిర్వాహకురాలు భగూ బాయి తెలిపారు. తద్వారా తమ సంఘానికి ప్రతి నెలా రూ.3 లక్షలు లబ్ధి చేకూరుతున్నట్లు వివరించారు.