ధరణితో లక్షల ఎకరాలు మాయం.. : బీఆర్ఎస్ కారు.. బేకార్ : రాజ్ నాథ్ సింగ్

ధరణితో లక్షల ఎకరాలు మాయం.. : బీఆర్ఎస్ కారు.. బేకార్ : రాజ్ నాథ్ సింగ్

ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేసిందంటూ.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. 2023, అక్టోబర్ 16వ తేదీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారాయన. 

ధరణి వెబ్ సైట్ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారాయన.
అదే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ స్వామిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కరికి భూమి హక్కులు ఇవ్వటం జరిగిందని.. శాటిలైట్ ఆధారంగా హద్దులు నిర్ణయించి.. వివాదాలు లేకుండా చేసినట్లు వెల్లడించారాయన. మోదీ తీసుకొచ్చిన భూ స్వామిత్రం పథకం ద్వారా భూమి పత్రాలపై బ్యాంకులు అప్పులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు రాజ్ నాథ్ సింగ్.
దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించి ఇవ్వటం జరిగిందన్నారు.

తెలంగాణలోనూ అభివృద్ధి జరగాలంటే.. పేదలకు మంచి జరగాలంటే మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారాయన.
బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజలను కోరారు రాజ్ నాథ్ సింగ్
కాంగ్రెస్ హయాంలో పేదలకు రూపాయి ఇస్తే.. 20 పైసలు మాత్రమే వారి దగ్గరకు చేరాయని.. అదే మోదీ హయాంలో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయటం ద్వారా అవినీతి అనేది లేదన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదే అన్నారు. 

తెలంగాణలో పార్టీలు కుల, మత, ప్రాంత, వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నాయని.. బీజేపీ అలాంటి ధోరణిలో వెళ్లటం లేదన్నారు. 
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు.. బేకారు అవుతుందని.. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు హ్యాండ్ ఇవ్వటం ఖాయమన్నారు. 
లక్ష్మీదేవి కమలంపై కూర్చుంటుందని.. కమలం గుర్తుకు ఓటేస్తే అంతా శుభమే జరుగుతుందని జోస్యం చెప్పారు రాజ్ నాథ్ సింగ్