
జనగామ: పోలీసులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ గూండాగిరి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. బీజేపీతో బల ప్రదర్శనకు సిద్ధమా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ నిజంగా హైదరాబాద్ కు చెందిన వాడైతే బల ప్రదర్శనకు రావాలని అన్నారు. పీఠం కదులుతుండటంతో సీఎం కేసీఆర్ భయపడిపోతున్నాడన్న సంజయ్.. అందుకే తన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
ప్రజలే సమాధానం చెప్తరు
ఫ్లెక్సీలు పెట్టి మోడీ ప్రధాన మంత్రి కాలేదన్న బండి సంజయ్.. బీజేపీ పార్టీ ప్రజల గుండెల్లో ఉంటుందని అన్నారు. జనగామ అడ్డాపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నయీంకు పట్టిన గతే సీఎంకు పడుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ చేస్తున్న తప్పులకు ఎన్నికలు వచ్చినప్పుడ ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. పాలకుర్తిలో యాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే... వేలాది మంది సభకు తరలివచ్చిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక షాపులు బంద్ చేయడమే కాక.. పవర్ కట్ చేసిన్రని విమర్శించారు.
ఇచ్చిన హామీలు ఏమైనయ్
జనగామ జిల్లాలో రిజర్వాయర్ సంగతి ఏమైందని, మిషన్ భగీరథ నీళ్లు వస్తే.. జనం నీళ్లు బయట ఎందుకు కొంటున్నరు కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. మెడికల్, ఐటీ, డిగ్రీ, పీజీ కాలేజీలు, నర్సింగ్ హోం, పెంబర్తి ఇండస్ట్రీయల్ కారిడార్, పాలకుర్తిని మున్సిపాలిటీ చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కనీస సౌకర్యాలు కల్పించలేని కేసీఆర్.. బీజేపీ సమాధానం చెప్పాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
కేంద్రం నుంచి భారీగా నిధులు
జనగామ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని బండి సంజయ్ అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూలి పనులు, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.71 కోట్ల నిధులు ఇవ్వడంతో పాటు కేంద్ర నిధులతో మాత శిశు సంక్షేమ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.