న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు నడ్డా దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నడ్డాను మర్యాదపూర్వకంగా కలినట్లు రాంచందర్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఈ భేటీలో రాజకీయపరమైన, పార్టీ సంస్థగత విషయాలపై చర్చించాం.
తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించినట్లు వివరించాం. ఈ ఫలితాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పని చేయాలని సూచించారు. బీజేపీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నడ్డా చెప్పారు" అని రాంచందర్ రావు వివరించారు.
