మా నాయకుల మధ్య విభేదాల్లేవ్..సోషల్ మీడియాలో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం: రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

మా నాయకుల మధ్య విభేదాల్లేవ్..సోషల్ మీడియాలో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం: రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: తమ నాయకుల మధ్య ఎలాంటి విభేదాల్లేవని, కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్​ రాంచందర్ రావు అన్నారు. బీజేపీ నాయకులు ప్రచారంలో పాల్గొనడం లేదంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేతల గురించి మాట్లాడే ముందు వారి పార్టీ నేతల గురించి చూసుకోవాలని సూచించారు.

 సీఎం కుర్చీ లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ముందు దాన్ని కాపాడుకోవాలన్నారు.  మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు చేస్తున్నారని, మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నది ఏంటని  ప్రశ్నించారు. ‘‘ముస్లింలు ఉన్నది కాంగ్రెస్ వల్లే అని సీఎం రేవంత్ చెప్పడం మత రాజకీయాలు కాదా? క్రిస్టియన్ల వద్దకు వెళ్లి బీజేపీకి ఓటు వేయొద్దనడం మత రాజకీయం కాదా?’’ అని అడిగారు. 

మూసీ ప్రక్షాళనతో ఎవరికి లాభం?

కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దోచుకుంటే..  మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ దోచుకోవాలని చూస్తున్నదని రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసింది శూన్యమని, రూ.లక్షల కోట్లతో మూసీ చేపట్టాలని చూస్తున్నారని, దానివల్ల ఎవరికి లబ్ధి జరగనుందని ఆయన ప్రశ్నించారు. కాగా, చివరిరోజు ప్రచారంలో భాగంగా వెంగళ్‌‌‌‌‌‌‌‌రావు నగర్ డివిజన్‌‌‌‌‌‌‌‌లో పాదయాత్ర చేపట్టారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ దాదాపు రూ.2.44 లక్షల కోట్ల అప్పు చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. పోలింగ్ రోజు వర్షం పడితే గెలుపు బీజేపీదేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు.  ఎందుకంటే వర్షం కురిస్తే.. అంతా జలమయమై కోపంతో తమకు ఓటు వేస్తారని ధీమాతో ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.