ఢిల్లీ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర

ఢిల్లీ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర
  • రాజ్​ఘాట్​లో  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ప్రార్థన
  • ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి గాంధీకి నివాళి

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు 40 మందిని కొని ఢిల్లీ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రచేస్తోందని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.800 కోట్లు పక్కన పెట్టుకుందని చెప్పారు. గురువారం తన ఇంట్లో జరిగిన పార్టీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాజ్​ఘాట్​కు వెళ్లారు. సమాధి వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించి.. దేశంలో శాంతి నెలకొనేలా చూడాలని ప్రార్థించినట్లు కేజ్రీవాల్​ చెప్పారు. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. ‘ఒక్కో ఆప్​ ఎమ్మెల్యేకు బీజేపీ రూ.20 కోట్లు ఆఫర్​ చేసింది. రూ.800 కోట్లు సిద్ధంగా పెట్టుకుంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? జనం తెలుసుకోవాలని అనుకుంటున్నరు. ఈ డబ్బు జీఎస్​టీదా..? లేదా పీఎం కేర్​ ఫండ్స్​ నుంచి తీశారా? లేకపోతే బీజేపీ లీడర్ల దోస్తులు ఇచ్చారా?” అని కేజ్రీవాల్​ ప్రశ్నించారు.

53 మంది ఎమ్మెల్యేలు హాజరు

గురువారం కేజ్రీవాల్​ ఇంట్లో జరిగిన మీటింగ్​కు 53 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని ఆప్​ అధికార ప్రతినిధి సౌరభ్​ భరద్వాజ్​ తెలిపారు. పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఔట్​ ఆఫ్​ స్టేషన్​లో ఉన్నారని చెప్పారు. సత్యేంద్ర జైన్​ జైల్లో ఉండగా.. ఓఖ్లా ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్​ వర్చువల్​గా పాల్గొన్నట్టు తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్​లో ఉన్నారన్న వార్తలో నిజంలేదని సౌరభ్​ భరద్వాజ్ స్పష్టం చేశారు.