టీఆర్ఎస్ ప్లెక్సీలు తొలగించాలంటూ బీజేపీ ధర్నా

టీఆర్ఎస్ ప్లెక్సీలు తొలగించాలంటూ బీజేపీ ధర్నా
  • టీఆర్ఎస్ ఫ్లెక్సీల రగడ.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్: నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్లు తొలగించాలంటూ బీజేపీ పిలుపు మేరకు ఆ పార్టీ నగర నాయకులు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీని ముట్టడించారు. బుద్ద భవన్ లోని జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి కార్పొరేటర్లు, ఇతర నాయకులు భారీగా తరలివస్తుండగా పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు.. బీజేపీ నాయకులకు మధ్య  వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారి విశ్వజిత్ ను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.

జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు, కార్పొరేటర్ లు ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ ఆధికారి విశ్వజిత్ టీఆర్ఎస్ పార్టీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని, టీఆర్ఎస్ కు ఒక న్యాయం.. ఇతరులకు మరొక న్యాయమా..?  సహించమంటూ నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన  కేసీఆర్, కేటీఆర్ లకు ఎంత జరిమానా విధిస్తారో జీహెచ్ఎంసీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులను జీహెచ్ఎంసీ అధికారులు కావాలనే  తీసుకోవటం‌లేదని ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీ జీతం ఇవ్వడం లేదని, ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతంగా తీసుకుంటున్న విషయాన్ని విశ్వజిత్ గుర్తుంచుకోవాలని సూచించారు. బీజేపీ ఫ్లెక్సీలను తొలగించి టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాపాడుతున్న‌ విశ్వజిత్ పక్షపాత ధోరణిని ఎండగడ్తామని హెచ్చరించారు. చిరు వ్యాపారులను సైతం జరిమానాలు  విధిస్తున్నారని, మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు జరిమానాలు విధించరా ? అని ప్రశ్నించారు. నగరంలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు.