పార్టీని మరింత బలోపేతం చేయాలి.. బీజేపీ నేతలకు అగ్ర నాయకుల దిశా నిర్దేశం

పార్టీని మరింత బలోపేతం చేయాలి.. బీజేపీ నేతలకు అగ్ర నాయకుల దిశా నిర్దేశం
  • పార్టీని మరింత బలోపేతం చేయాలి
  • బీజేపీ నేతలకు అగ్ర నాయకుల దిశా నిర్దేశం
  • రాష్ట్రాల చీఫ్​లు, ఇన్ చార్జులతో భేటీ
  • తెలంగాణ నుంచి కీలక లీడర్ల హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాల నేతలకు బీజేపీ అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ జాతీయ సమావేశాల రెండో రోజు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఇతర రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్ చార్జులతో హైకమాండ్  వేర్వేరుగా సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్  జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్  సింగ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. లోక్ సభలో ఎన్నికల్లో మిషన్ 370, కేంద్రంలో పదేండ్ల పాలన, రామ మందిర నిర్మాణం, ఇతర కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్రాల నేతలకు సూచించారు. గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన నియోజకవర్గాలపై ఫోకస్  చేయాలన్నారు. 

రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలపై ప్రత్యేక సమావేశం

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర నేతలను పార్టీ హైకమాండ్  ఆదేశించింది. తెలంగాణ ఎన్నికల వ్యూహాలపై భారత్  మండపంలో ఆదివారం సాయంత్రం ప్రత్యేక భేటీ జరిగింది. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ చీఫ్  కిషన్ రెడ్డి, ఇన్ చార్జి సునీల్  బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్  పాల్గొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  బూత్  లెవెల్ లో వ్యూహాలు, పార్టీ అగ్రనేతల ప్రచారం, ఓటర్లను పార్టీ వైపు మళ్లించే కార్యక్రమాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దక్షిణాదిలో రామ మందిర నిర్మాణ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున  కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ గా ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. పదేండ్ల మోదీ పాలన, తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధుల గురించి ప్రజలకు వివరించాలని, ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, అదే జోరును దక్షిణ తెలంగాణలో కొనసాగించాలన్నారు.