రాజ్యసభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్

రాజ్యసభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్
  • యూపీలో ఏడుగురు ఎంపీలకు దక్కని అవకాశం 
  • కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్, బీఎల్ వర్మ కూ నో చాన్స్ 

లక్నో: ఈ నెల 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయనున్న 8 మంది అభ్యర్థుల పేర్లను సోమవారం బీజేపీ ప్రకటించింది. అయితే, ఏడుగురు సిట్టింగ్​ఎంపీలను పక్కన పెట్టింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, మరో కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ  పేర్లు కూడా జాబితాలో లేవు. కేంద్ర కేబినెట్​లో త్వరలో మార్పులు జరగనున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సోమవారం ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్​లో రాష్ట్ర మంత్రి ధరంపాల్ సింగ్, అడ్వకేట్ రాధాకాంత్ ఓజా, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోంకర్, గోపి కృష్ణ పాండే, మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శృతి గంగ్వార్ ఉన్నారు. 

ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ సులభంగా ఏడు స్థానాలను గెలుచుకోనుంది. అలాగే, ఎనిమిదో స్థానం కోసం కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని కీలక కులాలు, వర్గాల మధ్య  సమతుల్యత పాటించింది. ఓబీసీ వర్గం నుంచి ముగ్గురు, జనరల్ కేటగిరీ నుంచి ముగ్గురు, షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నుంచి ఇద్దరు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. మరోవైపు ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ (ఎస్పీ).. మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అభ్యర్థులు మంగళవారం ఉదయం 11:30 గంటలకు లక్నోలో నామినేషన్లను దాఖలు చేస్తారు.