ఫలితం మార్చిన చౌటుప్పల్, చండూరు

ఫలితం మార్చిన చౌటుప్పల్, చండూరు

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తిరేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన బై పోల్ పోరులో బీజేపీని గులాబీ పార్టీ ఓడించింది. ముందు నుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న బీజేపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. బీజేపీ ఆశలు పెట్టుకున్న మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో కూడా ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడంతో ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ మొదటి నుంచి అర్బన్ ఓటు బ్యాంక్ ను నమ్ముకుంది.  చౌటుప్పల్, చండూరు మండలాల్లోని అర్బన్ ఓటర్లు తమకే ఓటేస్తారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ను ఈ రెండు మండలాలతో ఢీకొట్టవచ్చని ఆయన ఆశించారు. కానీ ఆ  రెండు మండలాల్లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.

మునుగోడు నియోజకవర్గంలో  మొత్తం 2 లక్షల 40 వేల ఓట్లు ఉంటే... చౌటుప్పల్ మండలంలో 83 వేలకు పైగా ఉన్నాయి. అయితే చౌటుప్పల్ మున్సిపాలిటీలో 23 వేల ఓట్లుంటే...అందులో 17 వేలు మాత్రమే పోలయ్యాయి. అంటే 73శాతం జనమే ఓట్లు వేశారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో 93 శాతం ఓటింగ్ నమోదైతే.. చౌటుప్పల్ పట్టణంలో ఇంత తక్కువగా పోలింగ్ జరగడం బీజేపీపై ఎఫెక్ట్ చూపింది.  

చౌటుప్పల్ లో..

చౌటుప్పల్ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించగా... టీఆర్ఎస్ కు 714 ఓట్ల ఆధిక్యం లభించింది. తొలి రౌండ్ లో వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్.. ఆ వెంటనే 2, 3 రౌండ్లలో వెనుకబడిపోయింది. అయితే నాలుగో రౌండ్ తో చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి బీజేపీని వెనక్కు నెట్టేసి తిరిగి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. నాలుగో రౌండ్ లో ఏకంగా 1,034 ఓట్ల ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్... ఓవరాల్ గా బీజేపీపై 714 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. చౌటుప్పల్ లో 5 వేల మెజార్టీ వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావించారు. కానీ ఫలితం పూర్తిగా రివర్స్ అయ్యింది.  

చండూరు మండలంలో..

చండూరు మండలంపై కూడా బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. చండూరు మున్సిపాలిటీలో 24 వేల 995 ఓట్లు, రూరల్‌లో 31 వేల 333 ఓట్లున్నాయి. 8వ రౌండ్లో 532 ఓట్లు, 9వ రౌండ్లో 832 ఓట్లు, 10వ రౌండ్లో 484 ఓట్ల మెజార్టీతో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగించింది. దీంతో బీజేపీ పెట్టుకున్న ఆశలు చండూరు కూడా అడియాశలు చేసిన పరిస్థితి ఎదురైంది. 

ఎనిమిదో రౌండ్ దాటే సరికే 3 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్న టీఆర్ఎస్ ఆధిక్యాన్ని చండూరు ఓట్లతో దాటేయాలని చూసిన బీజేపీకి మళ్లీ భంగపాటే ఎదురైంది. చండూరుకు చెందిన కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీతో నడిచారు.  మున్సిపాలిటీలో రాజగోపాల్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. ఆ ఓట్లను టీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకుంది. సంస్థాన్ నారాయణ పూర్ మండలంలోనూ మెజార్టీ వస్తుందని బీజేపీ ఆశించినా..టీఆర్ఎస్ కే ఆధిక్యం వచ్చింది.  బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై టీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అనుకున్నట్లుగా ప్రణాళికలను అమలుచేసి మునుగోడులో జెండా ఎగురవేసింది.