బీజేపీలో పార్టీ ఫండ్ పంచాది!

బీజేపీలో పార్టీ ఫండ్ పంచాది!
  • మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపు కోసం హైకమాండ్​ నుంచి భారీగా నిధులు
  •     ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వర్గీకరించి అభ్యర్థులకు పైసలు​
  •     ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తీరా పార్టీ పేలవ ప్రదర్శనపై హైకమాండ్ సీరియస్
  •     పార్టీ ఫండ్ అందకపోవడం వల్లే ఓడిపోయామని పలువురు అభ్యర్థుల నుంచి ఢిల్లీ దాకా ఫిర్యాదులు
  •     మధ్యలో పైసలు​ కాజేసిందెవరో తేల్చే పనిలో రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి

హైదరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టాలని భావిస్తున్న బీజేపీ హైకమాండ్​కు ఇటీవలి మున్సిపల్​ఎన్నికలు షాక్​ ఇచ్చాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ కేవలం 3 మున్సిపాలిటీలు, ఒక్క కార్పొరేషన్​ను మాత్రమే దక్కించుకుంది. ఇంకొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ తో కలిసి వైస్ చైర్​పర్సన్​పదవులకే పరిమితమైంది. 

అర్బన్​లో పార్టీ బలంగా ఉందని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దక్కించుకుంటామని నేతలు ఊదరగొట్టడంతో నమ్మిన ఢిల్లీ నేతలు పెద్దమొత్తంలో పార్టీ ఫండ్​అందజేసినట్లు సమాచారం. తీరా మున్సిపల్​ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో ఆరా తీయగా , అసలు హైకమాండ్​ఇచ్చిన ఫండ్​ తమదాకా రాలేదని చాలామంది అభ్యర్థులు వాపోయినట్లు తెలిసింది. దీంతో మధ్యలో పైసలు కాజేసిందెవరో తేల్చేందుకు జిల్లాలవారీగా ఎంక్వైరీ చేయిస్తుండడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

ఫండ్స్ పక్కదారి?

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ కసరత్తు చేసింది. వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పార్టీ బలాబలాల ఆధారంగా ఏ,బీ, సీ,డీ కేటగిరీలుగా వర్గీకరించి, అందుకు తగినట్లుగా ఎన్నికల ఫండ్ పంపిణీ చేసింది. ఒక్కో వార్డుకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఖర్చుల కోసం అందించినట్టు తెలిసింది. కాగా, పంపిన నిధులకు, వచ్చిన ఓట్లకు ఎక్కడా పొంతన లేకపోవడంతో ఢిల్లీ నేతలు షాక్ అయ్యారు. ఇదే క్రమంలో ఫండ్స్ పక్కదారి పట్టాయని ఫిర్యాదులు రావడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. 

కొందరికి పార్టీ ఫండ్ ఇచ్చి.. ఇంకొందరికి ఇవ్వలేదని అందుకే తాము ఓడిపోయామని అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. మరికొందరు తమకు తక్కువగా పార్టీ ఫండ్ ఇచ్చారనే పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అధిష్ఠానం మొదట అంతర్గత విచారణ చేపట్టింది. జిల్లా అధ్యక్షులు, ఎన్నికల ఇన్​చార్జిల ద్వారా నివేదికలు సైతం తీసుకున్నది. కానీ వారిచ్చిన రిపోర్టులతో సంతృప్తి చెందని హకమాండ్​ తాజాగా ఒక్కో జిల్లాకు ఒక్కో సీనియర్​ను బాధ్యులుగా నియమించి, ఎంక్వైరీ చేయిస్తున్నట్లు తెలిసింది. 

శిక్షణ తరగతులపైనా ఆరా..

మున్సిపల్ ఎన్నికల ఫండ్స్ వ్యవహారమే కాకుండా, పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిక్షణ తరగతుల నిర్వహణపై కూడా అధిష్టానం నివేదిక కోరినట్లు సమాచారం. ఈ క్లాసులు పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా.. లేదంటే కేవలం ఫొటోల కోసం ‘తూతూ మంత్రం’గా ముగిస్తున్నారా.. అన్న కోణంలోనూ సీనియర్లు ఆరా తీయనున్నారు. పార్టీ క్రమశిక్షణను కాపాడే విషయంలోఅధిష్టానం సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉందని, రిపోర్ట్ వచ్చిన వెంటనే యాక్షన్ ప్లాన్ మొదలవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

అభ్యర్థులతోనే నేరుగా మాట్లాడుతరు.. 

ఎంక్వైరీ కోసం నియమించిన సీనియర్ నేతలు పోటీ చేసిన అభ్యర్థులతో నేరుగా మాట్లాడనున్నారు. ‘మీ వార్డు కేటగిరీ ఏంటి.. పార్టీ నుంచి మీకు అందిన డబ్బులు ఎంత? ఖర్చు పెట్టింది ఎంత?’అని ఆరా తీయనున్నారు. కొన్ని చోట్ల ఏ కేటగిరీలో ఉన్న వార్డుల్లో డీ కేటగిరీ ఓట్లు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. కాగా, మూడ్రోజుల క్రితం క్రితం రాష్ట్ర బీజేపీ ఇన్​చార్జి అభయ్ పాటిల్ స్టేట్ ఆఫీసులో ఎంక్వైరీ టీమ్ సభ్యులతో భేటీ అయ్యారు. 

నిబద్ధత, పారదర్శకత కలిగిన నేతలు కాబట్టే ఈ బాధ్యత అప్పగించామనీ, ఎలాంటి మొహమాటాలకు పోకుండా వాస్తవాలతో రిపోర్టు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ నిధులను దుర్వినియోగం చేసే సంస్కృతికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఎన్నికల నిధులపై ఎంక్వైరీ కోసం అమిత్ షాకు లేఖ రాస్త: రాజాసింగ్ 

గత అసెంబ్లీ, పార్ల మెంట్ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు ఏ అభ్యర్థికి ఎంత అందాయి? ఎక్కడ గోల్‌‌‌‌‌‌‌‌మాల్ జరిగాయనే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అమిత్ షాకు మరోసారి లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులపై విచారణ జరిగితే, ప్రధాన లీడర్లంతా ఇండ్లలో కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. 

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నిజాన్ని గ్రహించి ప్రక్షాళన చేసినప్పుడే తెలంగాణలో బీజేపీ వర్ధిల్లుతుందని, రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.గతంలో ఢిల్లీ నుంచి తెలంగాణకు ఇంచార్జీలుగా వచ్చిన వారు ఇక్కడి బడా నేతలకు భయపడి వాస్తవాలను కేంద్రానికి రిపోర్ట్ చేయలేదని రాజాసింగ్ పేర్కొన్నారు. గత ఇంచార్జీలు భయపడి తప్పుడు నివేదికలు ఇచ్చి ఉండొచ్చనీ, కానీ మీరు భయపడవద్దని కోరారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీని అమ్మేవాళ్లు, కేంద్రం పంపిన నిధులు నొక్కేసే వాళ్ల గురించి కరెక్ట్ రిపోర్టు ఢిల్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు.