నేడు కలెక్టరేట్ల వద్ద రైతు సత్యాగ్రహ దీక్షలు

నేడు కలెక్టరేట్ల వద్ద రైతు సత్యాగ్రహ దీక్షలు
  • బీజేపీ పదాధికారుల సమావేశంలో నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం అన్ని కలెక్టరేట్ల ముందు బీజేపీ రైతు సత్యగ్రహ దీక్షలు నిర్వహించనుంది. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. దీనిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు.. అమలు తీరుపై చర్చించారు. ఈ నేపథ్యంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగానే బుధవారం కలెక్టరేట్ల ముందు దీక్షలు చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అలాగే..రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 12న రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్​లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దీనిలో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.