పోడు సమస్యలు ఎన్ని పరిష్కరించారో చెప్పాలె

పోడు సమస్యలు ఎన్ని పరిష్కరించారో చెప్పాలె

కరీంనగర్: ప్రజలను సీఎం కేసీఆర్ బానిసలుగా చేశారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కరీంనగర్ లో మౌనదీక్ష ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన కేసీఆర్కు లేదని..పోడు భూములపై 2018లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నిన్నటి ప్రెస్మీట్లో కేసీఆర్ ఫేస్లో భయం కనిపించిందన్నారు. ధరణితో ప్రజలకు లాభం లేదన్న బండి సంజయ్..15 లక్షల ఎకరాల వివరాలు ధరణి పోర్టల్లో లేవని తెలిపారు. 2018 నుంచి పోడు సమస్యలు ఎన్ని పరిష్కరించారో చెప్పాలన్నారు. ప్రశ్నిస్తే గిరిజనులపై లాఠీచార్జ్ చేస్తారా అని ప్రశ్నించారు. పచ్చి బాలింతపైననా మీ ప్రతాపం అని అన్నారు. కుర్చీ వేసుకుని సమస్యలు పరిష్కరిస్తానని చెబుతుంటారు. అందుకే నా దీక్షలో మహారాజా కుర్చీ వేశామన్నారు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని.. కరప్షన్ గురించి కేసీఆర్ మాట్లాడటం... దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని తెలిపారు. తన కుటుంబసభ్యులకు బంధువులకు మేలు చేసేందుకే ధరణి తెచ్చారని.. ధరణి వల్ల అనేక మంది రైతుల భూములు గల్లంతయ్యాయని చెప్పారు. కబ్జాకాలం తీసేయడంతో అనేక మంది భూములు కోల్పోవాల్సి వస్తుందని.. భూ సమస్యలపై అడిగేందుకు వెళ్తే...మా చేతిలో ఏమీ లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారన్నారు. ఎన్నో ఎకరాలు గల్లంతయ్యాయని.. లేని సమస్యలు తెచ్చి, కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాడన్నారు. రెవెన్యూ ఆఫీసుల్లో ధరణి లోపాలు దరఖాస్తులతో నిండిపోయాయని.. టీఆర్ఎస్ నేతలే ధరణితో ఇబ్బందులున్నాయని చెబుతున్నారని చెప్పారు. వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ బంధువుల పేరిట మార్చుకున్నాడని.. తన బండారం బయట పడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నాడని తెలిపారు. 

కరెక్షన్ ఆప్షన్ నీవు ఇవ్వడం లేదని.. ఓటు ద్వారా నీ అధికారాన్ని ప్రజలే కరెక్షన్ చేస్తారని తెలిపిన బండి సంజయ్.. మీడియా పట్ల గౌరవంగా మాట్లాడుతున్నారంటే బీజేపీ వల్లే అన్నారు. పోడుభూములను నమ్ముకుని బతుకుతున్న గిరిజనులపై దండయాత్ర చేపిస్తున్నాడని.. ఎన్నికలొచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని చెప్పడం మాట తప్పడం అలవాటుగా మారిందన్నారు. పంటలు వేసుకోవాలని చెప్పి... తీరా పంట చేతికొచ్చే సమయంలో పోలీసు, ఫారెస్టు అధికారులతో ధ్వంసం చేయిస్తాడన్నారు. మంచిర్యాల మండలం దండేపల్లి గిరిజన మహిళలపై అమానుషంగా ప్రవర్తించారన్నారు. పేదల భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారని.. లేదంటే టీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. అటవీ భూముల్లో పంటలు వేసుకున్నవాళ్లు ఎటునుంచి ఎవరు వస్తారోనని బిక్కుబిక్కుమంటు జీవిస్తున్నారని తెలిపారు. ధరణి, పోడు సమస్యలు వెంటనే పరిష్కరించాలనే ఈ మౌన దీక్ష చేపట్టానన్న బండి సంజయ్..పేద రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయించాలని డిమాండ్ చేశారు. పోడుభూములకు పట్టాలిచ్చేదాకా మా పోరాటం కొన సాగుతుందని తెలిపారు బండి సంజయ్.