ఎమ్మెల్యేల కొనుగోలు కేసును.. సిట్, సీబీఐకి ఇవ్వండి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును.. సిట్, సీబీఐకి ఇవ్వండి
  • ఘటన వెనుక రాజకీయ ఉద్దేశం 
  • రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు
  • ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి ఆరోపణలు అవాస్తవం: పిటిషన్​లో ప్రస్తావన
  • ఇయ్యాల విచారణకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో చేరాలంటూ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్లు నమోదైన కేసు దర్యాప్తును స్పెషల్​ఇన్వెస్టిగేషన్ టీమ్​(సిట్‌‌), సీబీఐకి అప్పగించాలని బీజేపీ హైకోర్టును కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర జనరల్‌‌ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్‌‌రెడ్డి రిట్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు భారీగా నగదు, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఎర వేశారంటూ టీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరతీసిందంటూ అందులో పేర్కొన్నారు. మొయినాబాద్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో నమోదైన (ఎఫ్‌‌ఐఆర్‌‌ నెం. 455/2022) కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం తమకు లేదని హైకోర్టు నియమించే సిట్‌‌ లేదా సీబీఐకి అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌‌ ప్రోత్సాహంతోనే తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతో దీన్ని నమోదు చేయించిందన్నారు. టీఆర్‌‌ఎస్‌‌కు చెందిన తాండూరు, అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌‌ ఎమ్మెల్యేలు రోహిత్‌‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్‌‌రెడ్డిని ముగ్గురు వ్యక్తులు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మొయినాబాద్‌‌ పోలీసులు నమోదు చేసిన కేసులో రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌‌ను పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ గురువారం దాఖలు చేసిన రిట్‌‌ పిటిషన్‌‌ను శుక్రవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.

రాజగోపాల్​రెడ్డికి ప్రజాదరణతోనే
‘‘బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో టీఆర్‌‌ఎస్‌‌ మెయినాబాద్‌‌ పీఎస్‌‌లో కేసు నమోదు చేయించింది. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా కేసు పెట్టారు. ఈ కేసులో నిజానిజాలు తేలాలంటే కేసు దర్యాప్తు బాధ్యతలను సిట్‌‌ లేదా సీబీఐకి అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలి. కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి మునుగోడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఎర వేసినట్లుగా కొత్త నాటకానికి తెరతీసింది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాగోపాల్‌‌రెడ్డికి మంచి ప్రజాదారణ లభిస్తోంది. మునుగోడులో ఓటమి భయంతో ఎలాగైనా బీజేపీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు నాటకాన్ని తెర మీదకు తెచ్చింది. బేరసారాలు జరిగాయని ఈ నెల 26వ తేదీ నుంచి టీఆర్‌‌ఎస్‌‌ అనుకూల టీవీ చానల్స్‌‌తో ఇష్టానుసారంగా ప్రచారం చేశాయి. ఇదే విషయాన్ని పోలీసులు కూడా మొయినాబాద్‌‌ ఫామ్ హౌస్‌‌ వద్ద మాట్లాడారు. సైబరాబాద్‌‌ ఏసీపీ ఫామ్ హౌస్‌‌కు వచ్చాక పిటిషనర్‌‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. నలుగురు టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్‌‌లోని సీఎంను కలుసుకున్నారు. ఆ తర్వాతే డీజీపీ మీడియా సమావేశాన్ని నిర్వహించి నలుగురు టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి రూ.100 కోట్లు చొప్పున చెల్లించేందుకు ముగ్గురు వ్యక్తులు బేరసారాలు జరిపినట్లు వెల్లడించారు. రామచంద్రభారతి అలియాస్‌‌ సతీష్‌‌ శర్మ, నందకుమార్, సింహయాజి స్వామిలు గత నెల 26న తనను సంప్రదించి బీజేపీలో చేరితే వంద కోట్ల రూపాయలు ఇప్పిస్తామనే ప్రతిపాదన చేశారని రోహిత్‌‌రెడ్డి చెబుతున్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిల్‌‌ కాంట్రాక్ట్‌‌ కూడా ఇప్పిస్తామని, లేనిపక్షంలో ఈడీ, సీబీఐ కేసులతోపాటు పలు క్రిమినల్‌‌ కేసులు ఎదుర్కొనాల్సివస్తుందని బెదిరించినట్లుగా కూడా పేర్కొన్నారు. అయితే రోహిత్‌‌రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం...’ అని రిట్‌‌ పిటిషన్‌‌లో బీజేపీ పేర్కొంది. కేసులో ప్రతివాదులుగా హోంశాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ, డీజీపీ, సైబరాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్, రాజేంద్రనగర్‌‌ ఏసీపీ. మొయినాబాద్‌‌ ఎస్‌‌హెచ్‌‌ఓ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎమ్మెల్యే పి.రోహిత్‌‌రెడ్డిని చేర్చింది.

ఓటమి భయంతో కుట్రలు
రాజకీయ దురుద్ధేశంతోనే మొయినాబాద్‌‌ పోలీసులు కేసు నమోదు చేశారని బీజేపీ తన పిటిషన్​లో పేర్కొంది. కేసీఆర్‌‌ ప్రోత్సాహంతో తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించింది. నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన తర్వాతే పోలీసులు మీడియాకు కేసు గురించి చెప్పారని తెలిపింది. మనుగోడులో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నందునే భయపడిన టీఆర్‌‌ఎస్‌‌  దుష్ఫప్రచారం చేసేందుకు కొత్త నాటకానికి తెరతీసిందన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా, కేసు వెనుక ఉన్న కుట్ర బయపడాలన్న హైకోర్టు పర్యవేక్షణంలో పనిచేసేలా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌‌)తో దర్యాప్తునకు ఆదేశించాలని, లేనిపక్షంలో సీబీఐకి అప్పగించాలని కోరింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని.. ఏ ప్రభుత్వంతోనూ సంబంధం లేని దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంది. అభ్యర్థనను పరిగనణలోకి తీసుకొని మోయినాబాద్‌‌ పోలీసుల దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.