మునుగోడులో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలి

మునుగోడులో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలి
  • ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలి
  • అక్రమ కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ కార్యకర్తల కోసం లీగల్ సెల్
  • మునుగోడులో ఓటర్ల జాబితా పరిశీలన
  • మీటింగ్‌‌లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన వివేక్ వెంకటస్వామి
  • బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. గెలుపే లక్ష్యంగా పార్టీ పరంగా పలు ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తూనే.. ఇంకో వైపు ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించనుంది. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ సునీల్ బన్సల్ ముఖ్య​అతిథిగా రాగా, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ సీనియర్ నేతలు విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, గరికపాటి మోహన్ రావు, దుగ్యాల ప్రదీప్ రావు, బంగారు శృతి, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. మునుగోడు బైపోల్‌‌‌‌‌‌‌‌లో గెలిచేందుకు ఎలాంటి ప్రచారం కొనసాగించాలనే దానిపైనే ప్రధానంగా చర్చించారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను తర్వాత మీడియా సమావేశంలో వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఈ నెల 7న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 10 నుంచి బూత్ కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో సమావేశాలు ఉంటాయని తెలిపారు. నియోజకవర్గంలోని 189 గ్రామాల్లో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లు, సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లు, ముఖ్య నేతలు బైక్ యాత్రలు నిర్వహిస్తారని వివరించారు.

బూత్ కమిటీలను పూర్తి చేయాలి

బూత్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని బన్సల్ ఆదేశించారని వివేక్ తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలి, ప్రజల్లోకి పార్టీ సింబల్‌‌‌‌‌‌‌‌ను ఎలా తీసుకెళ్లాలనే దానిపై మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చర్చించినట్లు వెల్లడించారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. కేసీఆర్ అవినీతి, అసమర్థ, నియంత, కుటుంబ పాలనను పల్లె, పల్లెన ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై చర్చించినట్లు వివేక్ వెల్లడించారు. మునుగోడులో టీఆర్ఎస్ నకిలీ ఓట్లను పెద్ద మొత్తంలో నమోదు చేయిస్తున్నదని, ఓటర్ల జాబితాను పరిశీలించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

చేనేత వస్త్రాలు కొన్న నేతలు

‘వోకల్ ఫర్ లోకల్‌‌‌‌‌‌‌‌’ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేయాలన్న ప్రధాని మోడీ ఆదేశాలతో బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌‌‌‌‌‌‌‌లో పలువురు పార్టీ నేతలు వస్త్రాలను కొనుగోలు చేశారు. పార్టీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఈటల రాజేందర్ తదితరులు చేనేత వస్త్రాలు కొన్నారు.

బీజేపీ ఆఫీసులో స్వచ్ఛ భారత్

గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆదేశం మేరకు బీజేపీ స్టేట్ ఆఫీసు ఆవరణలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.

మహాత్మా గాంధీకి ఘన నివాళి

బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు పార్టీ నేతలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, నేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఈటల రాజేందర్  తదితరులు పాల్గొన్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలను బీజేపీ నేతలు స్మరించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళులని చెప్పారు.

బీజేపీ ఆఫీసులోకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎట్లొస్తరు?: కిషన్ రెడ్డి

బీజేపీ స్టేట్ ఆఫీసుకు వస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘మా పార్టీ ఆఫీసులోకి మీరు ఎలా వస్తారు? ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? మరోసారి మా ఆఫీసులోకి వస్తే బాగుండదు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ఐబీ వాళ్లను పెడితే ఒప్పుకుంటారా? అలా ఒప్పుకుంటే.. ఇక్కడ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తా” అని సీరియస్ అయ్యారు.