రాష్ట్రంలో పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ ఆరా

రాష్ట్రంలో పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ ఆరా
  • కిషన్​రెడ్డి, సంజయ్, అర్వింద్ తో మాట్లాడిన ఢిల్లీ పెద్దలు 
  • కేంద్ర కమిటీకి రిపోర్టు పంపిన స్టేట్ పార్టీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్టు తెలిసింది. కాంగ్రెస్ పై మోడీ కామెంట్లు చేయడం, వాటిపై టీఆర్ఎస్ రాద్ధాంతం చేయడం, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు తప్పుడు ప్రచారం చేయడం, ఆందోళనలు చేపట్టడం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్, బీజేపీ నేతల హౌస్ అరెస్టులు, కార్యకర్తలపై దాడుల గురించి కూడా అడిగిందని పార్టీ రాష్ట్ర వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోనే ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ స్టేట్ చీఫ్ ​బండి సంజయ్, ఎంపీ అర్వింద్ సహా సీనియర్ నేతలతో ఢిల్లీ పెద్దలు మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుందని చెప్పాయి. మోడీ కామెంట్లపై టీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై జనం స్పందన, టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు రాష్ట్ర పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుందని తెలిపాయి. రాష్ట్ర బీజేపీపై మోడీ కామెంట్లు ఏమైనా ప్రభావం చూపాయా? అని కూడా అడిగిందని, పూర్తి వివరాలతో రిపోర్టు పంపామని రాష్ట్ర నేత ఒకరు చెప్పారు. కాగా, జనగామ టూర్​లో ప్రధాని పై, బీజేపీపై సీఎం చేసిన కామెంట్లపైనా అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ చేసే విమర్శలను ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నామని మరో నేత చెప్పారు. టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, జనాల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించారని తెలిపారు.