
-
సరిదిద్దేందుకు రంగంలోకి పార్టీ హైకమాండ్
-
ముఖ్య నేతలకు లోక్‌సభ స్థానాల సమన్వయ బాధ్యతలు
-
ఒక్కో నేతకు రెండు, మూడు స్థానాలు అప్పగింత
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత గొడవలను సరిదిద్దేందుకు ఏకంగా ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. పలువురు ముఖ్యనేతలకు లోక్‌సభ స్థానాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లను కొత్తగా పార్టీలో చేరిన వారికి కేటాయించడంపై బీజేపీ ముఖ్యనేతలు, కిందిస్థాయి కేడర్ అసంతృప్తిలో ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన అభ్యర్థులు.. కేడర్‌ను కలుపుకొని పోవడం లేదని, కేడర్‌ను, అభ్యర్థులను పట్టించుకోవడం లేదని అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో నేతలు, అభ్యర్థుల మధ్య సమన్వయం పెంచేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో జాతీయ నేతలను రంగంలోకి దింపుతున్నది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ కు హైదరాబాద్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల సమన్వయ బాధ్యతలను అప్పగించింది. ఆయన నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ నేతలతో గురువారం సమావేశం కానున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలైన చంద్రశేఖర్ తివారీ, సునీల్ బన్సల్, లక్ష్మణ్, కిషన్ రెడ్డికి సైతం ఒక్కొక్కరికి రెండు, మూడు లోక్ సభ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారడంతో, పంచాయితీలు పక్కనపెట్టి అభ్యర్థుల విజయంపై దృష్టిపెట్టాలని కేడర్‌కు సూచనలు చేస్తున్నది.
- రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా అభయ్ పాటిల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా అభయ్ పాటిల్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల మేనేజ్మెంట్, అభ్యర్థుల ప్రచారం తీరు, ఎన్నికల్లో కేడర్ పాల్గొనేలా నేతల్లో సమన్వయం చేసేందుకు అభయ్ పాటిల్ కృషి చేయనున్నారు.