
- స్వాతంత్ర్య వేడుకలో సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి
- మక్దూం భవన్ ప్రాంగణంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యానికి మూలమైన ఓటరు జాబితా గందరగోళమైందని, దొంగ ఓట్లు నమోదు చేసుకొని, బోగస్ పత్రాలతో, అబద్ధాల పునాదులపై బిహార్ లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ మక్దూం భవన్ ప్రాంగణంలో సీపీఐ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చాడ వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 11 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీప్రభుత్వం రాజ్యాంగ విలువలను పాతరేస్తున్నదని, ప్రాథమిక హక్కులు, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నరసింహ, ఐఏఎల్ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ పాల్గొన్నారు.