దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోంది : బోయినపల్లి వినోద్​కుమార్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోంది : బోయినపల్లి వినోద్​కుమార్

యాదాద్రి, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్​ అన్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ నోట్ల కట్టలతో కొని దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  చెప్పినట్టుగానే జరుగుతోందన్నారు. నలుగురు ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఎరవేసేందుకు బేరసారాలు జరిగాయన్నారు. తమ ఎమ్మెల్యేల నిఖార్సయిన తెలంగాణవాదులు కాబట్టే.. బేరసారాలను తిప్పికొట్టి, బీజేపీ బండారాన్ని బయటపెట్టారన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.  

మా వాళ్లు పులులు : మంత్రి మల్లారెడ్డి 

తమ ఎమ్మెల్యేలు పులులని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఇన్​చార్జీగా ఉన్న ఆరె గూడెం వచ్చిన దివీస్​ కంపెనీ యాజమాన్యంతో మంత్రి మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్​ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నం చేసిందని, వీరులు, శూరులు, పులులైన తమ ఎమ్మెల్యేలు లొంగలేదన్నారు. సీఎం కేసీఆర్​ తమను అలా తయారు చేశారన్నారు. దివీస్​ కంపెనీ కారణంగా కాలుష్యం పెరిగిపోతోందని చెప్పారు. ఈ కారణంగా ఆరెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని వారికి చెప్పామన్నారు. ఊరిలో హాస్పిటల్, పాఠశాల  కట్టడంతో పాటు రోడ్లు కూడా వేస్తారన్నారు. కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారన్నారు. వచ్చే నెల నుంచే రిక్రూట్​మెంట్​ఉంటుందన్నారు.