
- నిత్యం జనంలో ఉండేలా బీజేపీ కార్యాచరణ
- ఈ నెల 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘టిఫిన్ బైఠక్’
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు పార్టీ నేతలంతా నిత్యం జనంలో ఉండేలా వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను బీజేపీ రెడీ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌పై, జనం సమస్యలపై పోరాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. దీనిపై చర్చించేందుకు సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీసు బేరర్ల మీటింగ్ జరిగింది. సుమారు 4 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మంగళవారం మరోసారి సమావేశమై.. సోమవా రం చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏయే అంశాలపై జనంలో పోరాడాలి, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ఎలాంటి ప్రోగ్రామ్ లు కొనసాగించాలనేది మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటించనున్నారు. మీటింగ్‌లో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జ్ సునీల్ బన్సల్, నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
16న ‘టిఫిన్ బైఠక్’
ఇప్పటి వరకు పూర్తి చేయని పార్టీ పరమైన ప్రోగ్రామ్ లను వచ్చే నెల 15 లోపు పూర్తి చేయాలని సోమవారం జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో నిర్ణయించారు. బహిరంగ సభలు నిర్వహించడం, ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమాన్ని పూర్తి చేయడం, మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా పార్టీ నేతలు వివిధ రంగాల ప్రముఖులను కలవడం వంటివి స్పీడప్ చేయాలని ఆఫీసు బేరర్లను సునీల్ బన్సల్ ఆదేశించారు. ఈ నెల 16 న ‘టిఫిన్ బైఠక్’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆరోజు రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో నేతలందరూ తమ ఇంట్లో నుంచే టిఫిన్ తెచ్చుకొని, నియోజకవర్గ కేంద్రంలోని ఓ చౌరస్తాలో టిఫిన్ చేస్తూ చిట్ చాట్ లాగా మాట్లాడుకుంటారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ, 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సమావేశంలో చర్చించారు. 10 ఉమ్మడి జిల్లాల్లో త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించాలని నిర్ణయించారు. ఆ తేదీలను మంగళవారం ఖరారు చేయనున్నారు. మంగళవారం జరగనున్న మీటింగ్ కు రాష్ట్రానికి చెందిన నేషనల్ ఆఫీసు బేరర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు.
బీజేపీని వీడేది లేదు: మహేశ్వర్ రెడ్డి
బీజేపీని వీడేది లేదని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘నేను పార్టీ వీడుతాననేది ఒక వర్గం చేస్తున్న ప్రచారం మాత్రమే. ఇందులో వాస్తవం లేదు” అని చెప్పారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉందని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాగా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ముథోల్ మాజీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీని గెలిపిస్తామని చెప్పారు.
సెక్యూరిటీ కావాలని అడుగలేదు: అర్వింద్
స్పెషల్ సెక్యూరిటీ కావాలని తాను ఎవరినీ అడుగలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. గతంలో తనపై జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ సెక్యూరిటీ అధికారులు సోమవారం తన ఇంటికి వచ్చారని ఆయన మీడియాతో అన్నారు. ఎలాంటి సెక్యూరిటీ తనకు ఇస్తారో తెలియదని చెప్పారు.
వారణాసికి వెళ్లిన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి వెళ్లారు. మంగళవారం సంజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడంతో పాటు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు..
ఏ పార్టీతోనూ దోస్తానా ఉండదు: ప్రకాశ్ జవదేకర్
బీజేపీకి ఏ పార్టీతో దోస్తానా ఉండదని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడుతామని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఆఫీసు బేరర్ల మీటింగ్ లో నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో అధికారంలోకి వచ్చే విషయంలో హైకమాండ్ సీరియస్ గా ఉందని, ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ విషయం రాష్ట్ర నేతలు గుర్తించి ఇప్పటి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.
గ్రౌండ్ లెవల్లో జీరోగా ఉండొద్దు: సునీల్ బన్సల్
గ్రౌండ్ లెవల్లో జనం మద్దతు, ఆదరణ, పార్టీ పటిష్టంగా ఉంటేనే నాయకులు అవుతా రని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్చార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. కానీ బయ ట నాయకులుగా ఉండి, సొంత ప్రాంతా ల్లో జీరోలుగా ఉండొద్దని సూచించారు. ఇప్పటికైనా నేతలందరూ వెంటనే వారి వారి నియోజకవర్గాల్లో.. వారికి అప్పగించిన పార్టీ పరమైన పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.