టీఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రజాకార్ల పార్టీ

టీఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రజాకార్ల పార్టీ

సీఎఎ(పౌరసత్వ సవరణ చట్టం)  బిల్లును వ్యతిరేకిస్తున్న టీఆరెస్ నేతలకు బిల్లుపై ఉన్న అనుమానాలు, ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేకపోతే అధ్యక్ష పదవికే రాజీనామా చేస్తానన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రతిపక్షాలు చట్టంపై అవగాహన లేక రాద్ధాంతం చేస్తూ రోడ్లమీదకు వస్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీని ఏకాకి కావాలని చూస్తున్నాయని…కానీ వారే ఏకాకులు అవుతున్న సంగతి గమనించుకోవట్లేదని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు.  ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

సమావేశంలో.. నెహ్రు ప్రధాని కావడంకోసమే ఆనాడు దేశ విభజన జరిగిందని, అప్పుడు విభజన జరగకపోయుంటే ఇప్పుడు ఈ బిల్లులు అవసరమే ఉండేదికాదన్నారు లక్ష్మణ్. దేశంలో శాంతియుత ప్రదర్శనలు చేసుకోండి కానీ విధ్వంసాలు చేస్తే ఊరుకోవడానికి ఇదేం ములాయం, అఖిలేష్, మమత సర్కార్ కాదన్నారు. దేశంలో ఉన్నది మోడీ, అమిత్ షా ప్రభుత్వమని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ సర్కార్ గురించి ప్రస్తావిస్తూ..” ప్రతిపక్షాలు ముస్లింలను ఇక్కడినుండి పంపిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆరెస్ ఎంపీలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకించారు,ఎందుకని అడిగితే అందులో ముస్లిం అనేపదం లేదన్నారు,మీకు పాకిస్థాన్ ముస్లిం కావాలా,బంగ్లాదేశ్ ముస్లిం కావాలా అని” ఆయన ప్రశ్నించారు.

టీఆరెస్ ఎంఐఎం ను పట్టుకుని పాకులాడుతుందని, మజ్లీస్ అడుగులకు మడుగులొత్తుతున్న టీఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రజాకార్ల పార్టీ అని లక్ష్మణ్ అన్నారు. “హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న కేసీఆర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రకాల్చి వాతపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం కావాలి. ఒక్కసీటు ఓడిపోతే మంత్రి పదవిపోతదని మంత్రులకు చెప్పిన కేసీఆర్,అన్ని సీట్లలో గెలుస్తామని ఎలా చెబుతాడు? టీఆరెస్ కు పోటీ బీజేపీ కాదు,కాంగ్రెస్ అంటున్న కేటీఆర్..  బీజేపీని చూసి  భయపడుతున్నాడు. బీజేపీ ఎక్కడుందని కవితను ఓడించిన నిజామాబాద్ లో, కరీంనగర్, ఆదిలాబాద్ లలో అడగండి చెబుతారు” అని కేటీఆర్ ను ఉద్దేశించి లక్ష్మణ్ అన్నారు.