
- బీఆర్ఎస్లో 4 స్తంభాలాట ముందే చెప్పినం: బీజేఎల్పీ నేత ఏలేటీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి కవిత త్వరలోనే బయటకు వెళ్లి కొత్త పార్టీ పెడుతారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లో నాలుగు స్తంభాలాట కొనసాగుతున్నదని తాము ముందే చెప్పామని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కవిత లేఖ విషయం పది రోజుల ముందే చెప్పానన్నారు. ఆమె బయటకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారని స్పష్టం అయిందని పేర్కొన్నారు.
ఇదంతా కూడా అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగిన పంచాయతీయేనని ఆరోపించారు. అన్నీ అన్నకేనా అని కవిత అడుగుతున్నారని, కేసీఆర్కు రాసిన లేఖలో ఆమె తన ఆవేదన తెలిపారని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థులను సొంతంగా పెట్టే అవకాశం ఉందని లేఖ ద్వారా తెలుస్తోందని వెల్లడించారు. త్వరలోనే బీఆర్ఎస్ లో మరో ప్రకంపన జరగబోతుందని చెప్పారు.