న్యూయార్క్: అమెరికాలోని తెలంగాణ ప్రవాసీలు వచ్చే నవంబర్‌లో పెద్దఎత్తున బీజేపీలో చేరుతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో జరిగిన తెలంగాణ మిత్రుల ‘మీట్ అండ్ గ్రీట్’లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వారంతా ఒక్కచోట కలిశారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోతోందని, కేసీఆర్ కుటుంబ పాలనలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్యం, మహిళా సాధికారత, రైతాంగ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు, తెలంగాణవాది ఏనుగు లక్ష్మణ్‌ను బీజేపీలోకి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆయన బాటలోనే చాలా మంది వచ్చే నవంబర్‌లో పార్టీలో చేరుతారన్నారు. కార్యక్రమంలో ఓవర్సీస్ బీజేపీ నేతలు కృష్ణారెడ్డి, విలాస్ జంబుల, శ్రీకాంత్‌రెడ్డి, నీలిమ మదన్, శివ దాసన్, ప్రదీప్ కట్ట, అమర్, శ్రీకాంత్, రవి తుమ్మ, యోగి, అనిత, విజయ, ఆనంద్, ఫణి భూషణ్ పాల్గొన్నారు.
