- ఐఏఎస్ వీఆర్ఎస్పై సిట్ ఏర్పాటు చేయాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీఎం, మంత్రుల మధ్య కమీషన్ల వాటాలు, మూటల కోసం కొట్లాటలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేబినేట్ కాస్త వాటాల కేబినేట్, కమీషన్ల కేబినేట్, కరప్షన్ కేబినేట్ గా మారినట్లు ప్రజల్లో టాక్ ఉందన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. " సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య వాటాల పంచాయతీతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటున్నది. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ లకు సీఎంకు మధ్య విబేధాలున్నాయి. తాజా పరిణామాలే దానికి సాక్ష్యం.
తుపాకీ పెట్టి బెదిరించిన సుమంత్ ను అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నవారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు? దీపావళి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ కలిసి మాట్లాడుకుంటే కేసులు మాఫీ చేస్తారా? సీఎం, మంత్రి జూపల్లి కృష్ణారావుకు మధ్య కూడా విబేధాలు వచ్చాయి. వీరి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేశారు. దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలి.
విద్యాశాఖమంత్రి, హోంమంత్రి లేక రాష్ట్రం అధోగతి పాలవుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. దీనిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నం" అని ఏలేటి పేర్కొన్నారు. రేవంత్ సర్కారు ఇంకా మూడేండ్ల పాటు కొనసాగితే రాష్ర్టానికి నష్టమేనని తెలిపిన ఆయన..ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
