హైదరాబాద్: తెలంగాణలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్షాళన (ఎస్ఐఆర్) చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను అందరం కలిసి విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఆదివారం (డిసెంబర్ 21) హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీఎల్‍వోలతో (BLOs) సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్లో విజయవంతంగా ఎస్ఐఆర్ నిర్వహించి బీఎల్వోలు దేశానికి మార్గనిర్దేశం చేశారని అన్నారు. ఎస్ఐఆర్ నెక్ట్స్ చేయబోయేది తెలంగాణలోనేనని చెప్పారు. కెనడా దేశం కంటే తెలంగాణ పెద్దదని.. ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చక్కగా చేయాలని బీఎల్వోలకు సూచించారు.
తెలంగాణలో సరాసరి 930 మంది ఓటర్లు ఒక బీఎల్వో పరిధికిలోకి వస్తారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తోందని.. మిగలిన రాష్ట్రాల్లోనూ త్వరలోనే చేపడతామన్నారు. దేశంలో రాజ్యాంగానికి అతిపెద్ద సైనికుడు బూత్ లెవెల్ ఆఫీసర్ అని బీఎల్వోలను కొనియాడారు. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి భారత కేంద్ర ఎన్నికల సంఘం చేరుకుందని.. ఏడాది పాటు ఇంటర్నేషనల్ ఐడియా సంస్థకు సీఈసీనే నాయకత్వం వహించనుందని తెలిపారు.
