ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టే కుట్ర

ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టే కుట్ర
  • పాలన చేతకాకుంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్
  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని బీజేఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం పదే పదే చెప్పడం వెనుక, ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టే కుట్ర ఉందని విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలకు మద్దతు పలికేలా మంత్రి తుమ్మల నాగేశ్వరావు కూడా ఉచితాలు వద్దని చెబుతున్నారని వివరించారు. సీఎం అంటే ప్రజలకు భరోసా కల్పించాలని, కానీ రేవంత్ రెడ్డి.. ఉద్యోగస్తులపైకి ప్రజలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. 

ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం పరిస్థితి దివాలా తీయడానికి కేసీఆర్ ఎంత కారణమో.. కాంగ్రెస్ కూడా అంతే కారణమని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన పెండింగ్ బిల్స్, చిన్న, పెద్ద కాంట్రాక్టర్లకు ఎంత బిల్లులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీ ట్యాక్స్ వసూలు చేయడంతో చిన్న కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని సవాల్ విసిరారు.