- కేంద్రాన్ని కోరిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వివేక్
- కేసు రీఓపెన్ చేయాలని వినతి
- సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్న వివేక్
- వీఆర్ఎస్ బాధితుల హామీని కేసీఆర్ మరిచిపోయారని మండిపాటు
న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి వీఆర్ఎస్ బాధితుల సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కలిశారు. సింగరేణి సంస్థ ఒత్తిడితో 1997 నుంచి 2001 మధ్య వీఆర్ ఎస్ తీసుకున్న కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రిని వివేక్ కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
1,795 మంది బాధితులు
1997 నుంచి 2001 వరకు 1,795 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకునేలా సింగరేణి సంస్థ ఒత్తిడి చేసిందన్నారు. సింగరేణి యూనియన్ ఒత్తిడితో వీఆర్ఎస్ తీసుకున్న వారి వారసులకు ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు. నెలకు 30 మంది చొప్పున రెండేండ్లలో 1,795 బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామంటూ యూనియన్ తో యాజమాన్యం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుందని, కానీ ఇంత వరకు ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరగలేదని చెప్పారు. తాను వీఆర్ఎస్ బాధితుల సమస్యను కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లానని, ప్రభుత్వంలో మనం ఉన్నాం వారికి న్యాయం చేద్దామని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ హామీని విస్మరించారన్నారు. రీఓ
పెన్ చేయాలని కోరినం
వీఆర్ఎస్ సమస్య అలాగే ఉందని, బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా ఎంప్లాయిస్ ను తీసుకుంటున్నారని, అందువల్ల కేంద్ర మంత్రిని కలిసి 1,795 మంది కార్మికుల వీఆర్ఎస్ కేసును రీఓపెన్ చేయాలని కోరామని వివేక్ తెలిపారు. ఈ అంశంపై కేంద్ర లేబర్ కమిషనర్ కు ఆర్డర్స్ పాస్ చేయాలని మంత్రిని కోరినట్టు చెప్పారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని వివేక్ చెప్పారు. వివేక్‌తో పాటు బీఎంఎస్ ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షుడు సూర్య నారాయణ, వీఆర్ఎస్ బాధితులు మబ్బు శంకర్, లక్ష్మారెడ్డి తదితరులు కేంద్ర మంత్రిని కలిశారు.
