హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగాలు అడగడమే నేరమైపోయిందని, శాంతియుతంగా నిరసన తెలిపితే సర్కారు దారుణంగా దిగ్బంధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లలో జాబ్ క్యాలెండర్ కోసం నిరసన చేపట్టిన నిరుద్యోగులపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఎన్నికలకు ముందు అశోక్‌నగర్ లైబ్రరీలో నిరుద్యోగుల కాళ్ల దగ్గర కూర్చుని హామీలిచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం అయ్యాక అదే నిరుద్యోగులను రక్తం వచ్చేలా కొట్టించడం దుర్మార్గమన్నారు. ఆడబిడ్డలని కూడా చూడకుండా రాత్రి 3 గంటలకు పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లడం, గాయపడ్డ వారిని ఈడ్చుకుంటూ వెళ్లడం రేవంత్ మార్క్ 'ప్రజాపాలన'కు నిదర్శనమా అని ప్రశ్నించారు.
