- సభకు రాని లీడర్ కోసం పీపీటీలా?
- బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నయని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ‘విలన్’ కేసీఆరేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు 299 టీఎంసీలకు సంతకం పెట్టి.. రాష్ట్రాన్ని ముంచేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపల మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటూ.. బయట మాత్రం తిట్టుకుంటున్నట్టు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీని బలహీన పరిచేందుకే ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, వాటి మధ్య స్పష్టమైన అవగాహన ఉందని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రాని లీడర్ (కేసీఆర్) చెబితే.. సీఎం రేవంత్ రెడ్డి సభలో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇవ్వడం ఏంటని మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ బయట మాట్లాడుతరు. సభకు రారు. కానీ, వీళ్లేమో సభలో ఆయన గురించి, ఆయన అడిగిన దాని గురించి మాట్లాడుతరు. దీన్ని బట్టే వాళ్ల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు’’ అని ఎద్దేవా చేశారు.
వాళ్లు చేసిన తప్పులు బయటపడకుండా ఉండేందుకే సభను సరిగ్గా నడవనివ్వడం లేదని, మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా.. గత ప్రభుత్వంపై ఒక్క కేసు విచారణ కూడా పూర్తి కాలేదని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ కాక మరేమిటని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలను కేవలం నాలుగు రోజులకే పరిమితం చేయడం దారుణమని మహేశ్వర్రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలన్నింటిపై చర్చ జరగాలంటే కనీసం నెల రోజుల పాటు సభను నడపాలని డిమాండ్ చేశారు.
