మహబూబాబాద్, వెలుగు: దేశంలో 50 ఏండ్లుగా జరిగిన ప్రజా ఉద్యమాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాల డీజీపీలకు ఆదేశించడంమంటే ప్రజాఉద్యమాల అణచివేతకు కుట్ర చేయడమేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు, బుధవారం స్థానిక వీరభవన్ లో చింతకుంట్ల వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా ఉద్యమాలపై అణచివేత చర్యలు తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దృష్టి అంతా కార్పొరేట్ శక్తుల పైనే ఉండడంతో పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. జనవరి 18న సీపీఐ 100వ వార్షికోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి, జిల్లా సహాయ కార్యదర్శి బి అజయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు
