బీజేపీ లీడర్ ముక్కెర కిడ్నాప్​ కలకలం..

బీజేపీ లీడర్ ముక్కెర కిడ్నాప్​ కలకలం..
  •     ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులపై అనుమానాలు
  •     ఆటోలో ఘట్​కేసర్​ వెళ్లి  కారు తెప్పించుకున్నాడన్న పోలీసులు  
  •     వెతుకుతున్న మూడు టీమ్స్​

అల్వాల్/జనగామ/బచ్చన్నపేట, వెలుగు : బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని దబ్బగుంటపల్లికి చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్ కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్​లోని అల్వాల్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తిరుపతి రెడ్డి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె కిడ్నాప్ ​అని చెబుతుండగా పోలీసుల దర్యాప్తులో వేరే విషయాలు బయటకు వచ్చాయి. తిరుపతి రెడ్డి అల్వాల్​ నుంచి ఆటోలో ఘట్​కేసర్​వెళ్లారని, అక్కడి నుంచి కారు తెప్పించుకుని గుర్తు తెలియని చోటుకు వెళ్లారని చెబుతున్నారు.  

 తిరుపతి రెడ్డి భార్య ఏమన్నారంటే..

తిరుపతి రెడ్డి కుటుంబం హైదరాబాద్ లోని కుషాయిగూడలో స్థిరపడింది. తిరుపతి రెడ్డికి హైదరాబాద్ తో పాటు జనగామ జిల్లాలోను రియల్ ఎస్టేట్ బిజినెస్​ ఉంది. అల్వాల్​లో 5,929 గజాల స్థలం ఉంది.  కొన్ని నెలల క్రితం ఈ స్థలం విషయంలో గొడవ జరగడంతో పోలీసులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం అల్వాల్ తహసీల్దార్​ ఆఫీసుకు కారులో డ్రైవర్​తో కలిసి వెళ్లాడు. డ్రైవర్ ని జిరాక్స్ కోసం పంపించాడు. ఆయన తిరిగి వచ్చేసరికి తిరుపతిరెడ్డి కనిపించలేదు. అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో తిరుపతిరెడ్డి భార్య సుజాత అల్వాల్ పోలీసులతో పాటు సైబరాబాద్​ సీపీ స్టీఫెన్ రవీంద్రకు  ఫిర్యాదు చేశారు. స్థల వివాదంలో ప్రత్యర్థి వర్గమే తన భర్తను కిడ్నాప్​ చేశారని పేర్కొన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులపై ఆరోపణలు చేశారు. మామిడి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి రెడ్డికి చెందిన ఎకరంన్నర భూమిని జనార్దన్ రెడ్డి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి అండదండలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తిరుపతి రెడ్డి ఆచూకీ దొరకబట్టాలని అతడి కుటుంబసభ్యులు అల్వాల్ పీఎస్​ ముందు నిరసనకు దిగారు. జనార్దన్​రెడ్డిపై పలు పోలీస్​స్టేషన్లలో పీడీ యాక్ట్​తో పాటు 15 కేసులు ఉన్నట్టు సమాచారం. దీంతో జనార్దన్ ​అనుచరులపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలిసింది. 

పోలీసులు ఏమంటున్నారంటే...

తిరుపతి రెడ్డి భార్య ఫిర్యాదు ఒక రకంగా ఉండగా పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు మాత్రం తమ దర్యాప్తులో వేరే విషయాలు తెలిశాయని చెప్పారు. గురువారం అల్వాల్ తహసీల్దార్ ఆఫీస్ కు కారులో వచ్చిన తిరుపతిరెడ్డి ఐదు నిమిషాల్లోనే ఓ ఆటోలో వెళ్లాడని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. డ్రైవర్ తో రూ.700కు కిరాయి మాట్లాడుకొని ఘట్​కేసర్​వైపు వెళ్లినట్లు తేల్చారు. వందన హోటల్ దగ్గర దిగి జ్యూస్ తాగి హోటల్​లో ఓ వ్యక్తి ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్​ కృష్ణకు ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. తర్వాత కారు తెప్పించుకుని అందులో ఎక్కడికో వెళ్లాడని అంటున్నారు. దీంతో కృష్ణను అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తిరుపతి రెడ్డి ఎక్కడికి వెళ్లింది అతడికి తెలిసి ఉంటుందని భావిస్తున్నారు. తిరుపతిరెడ్డి కోసం నాలుగు టీములు గాలిస్తున్నాయి.