V6 News

మజ్లిస్ కోసమే సిటీ మూడు ముక్కలు : రాంచందర్ రావు

మజ్లిస్ కోసమే సిటీ మూడు ముక్కలు : రాంచందర్ రావు
  •     క్విడ్ ప్రో కో కింద గ్రేటర్ స్వరూపాన్ని మార్చేస్తరా?: ఎన్.రాంచందర్ రావు 
  •     పబ్లిక్ ఒపీనియన్ లేకుండానే 300 డివిజన్లు ఎట్ల చేస్తరని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహా నగరంతో కాంగ్రెస్ ప్రభుత్వం గిల్లీదండ ఆడుతోందని, మజ్లిస్ పార్టీకి లాభం చేసేందుకే ‘క్విడ్ ప్రో కో’కింద హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు.సిటీని మూడు ముక్కలు చేసి.. అందులో ఒక భాగాన్ని ఎంఐఎంకు దారాదత్తం చేసేందుకే ఈ 300 డివిజన్ల తతంగం అని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జీహెచ్ఎంసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. 

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా, జనాల ఒపీనియన్ తీసుకోకుండా డివిజన్లను 300కు ఎట్లా పెంచుతరు. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలి. 69 లక్షల ఓటర్లు ఉన్న జీహెచ్ఎంసీని అకస్మాత్తుగా కోటి 69 లక్షల జనాభాకు పెంచి, దేశంలోనే పెద్ద సిటీ చేస్తామని గొప్పలు చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరే ఉంది. ఇప్పటికే విలీనమైన వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు లేవు.. అవేమీ పట్టించుకోకుండా కొత్త ప్రాంతాలను కలుపుతామనడం అవివేకం. 

300 వార్డుల విభజన వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. విస్తరణను మూడు భాగాలుగా చేసి.. మజ్లిస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసింది”అని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి విరోధక శక్తుల చేతుల్లోకి వెళ్తే సిటీ నాశనమవుతుందని, ఈ కుట్రను అడ్డుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాగా, గ్లోబల్ సమిట్‌‌లో ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కంపెనీల్లో పదికి పైగా డొల్ల కంపెనీలేనని ఆరోపించారు.