సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత రవీంద్ర నాయక్ ఫైర్ 

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత రవీంద్ర నాయక్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపలేదని సీఎం కేసీఆర్​ను బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. ట్రైబల్ రిజర్వేషన్ల కోసమే సెపరేట్​గా తీర్మానం చేసి పంపాలని కేంద్రం అడిగితే, ఇప్పటికీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ ప్రశ్న అడిగితే, తమకు రాష్ట్ర సర్కార్ నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. దీనిపై వివాదం తలెత్తడంతో బుధవారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రవీంద్ర నాయక్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ రాష్ట్ర సర్కార్ 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే గిరిజన రిజర్వేషన్లపై మాత్రమే తీర్మానం చేసి పంపాలని కేంద్రం కోరింది. కానీ ఇప్పటికీ  ప్రభుత్వం పంపలేదు” అని ఆయన చెప్పారు. ‘‘ట్రైబల్ రిజర్వేషన్లు 9.08% అమలు చేయాలని 2015లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అమలు చేసేందుకు తమ కు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం కూడా చెప్పింది. రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి” అని రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. 

హరీశ్​కు బుద్ధి పెరగలే..
రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చి 2014, 2018 ఎన్నికల్లో గిరిజనుల ఓట్లను కేసీఆర్ దండుకున్నారని రవీంద్ర నాయక్ అన్నారు. వడ్ల కొనుగోళ్ల కోసం మంత్రులను ఢిల్లీకి పంపిన కేసీఆర్.. రిజర్వేషన్ల కోసం ఏనాడైనా మంత్రులను ఢిల్లీకి పంపించారా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై కేంద్రాన్ని విమర్శిస్తున్న మంత్రి హరీశ్ పై ఫైర్ అయ్యారు. ‘‘హరీశ్ మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదు” అని కామెంట్ చేశారు.