అసదుద్దీన్ నీ పౌరుషం ఆ రోజు ఏమైంది?

అసదుద్దీన్ నీ పౌరుషం ఆ రోజు ఏమైంది?
  • రామా అంటే అసదుద్దీన్‌కు బూతులా వినిపిస్తుందేమో!
  • బీజేపీ లీడర్ విజయశాంతి

రామా అనే పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందేమోనని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. మనుషులందరూ భారతీయులేనని మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ దృష్టిలో తప్పుగా అనిపించాయని ఆమె వ్యాఖ్యానించారు. 

‘భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటిచెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. రామా అనే పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమోననే అనుమానం కలుగుతోంది. దేశంలో ముస్లింలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో  జరుగుతున్న మూక దాడులను ఖండించడంతోపాటు ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరం. మొదట్లో భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల కారణంగా ముస్లింలు గాను, ఇతర మైనార్టీ వర్గాల వారీగా రూపాంతరం చెందారు. ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారు. కానీ ఈ మాటలు అసదుద్దీన్ దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయి. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్ ఓవైసీకి.. భగవత్ అభిప్రాయం క్రిమినల్ ఆలోచనగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ, గతంలో ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలి. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఎందుకు నోరు మెదపలేదు? ఇప్పుడు మోహన్ భగవత్ మీద వచ్చిన పౌరుషం.. ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుంది.