Hyderabad: బోనమెత్తిన రాములమ్మ..

Hyderabad:  బోనమెత్తిన రాములమ్మ..

భాగ్యనగరంలో బోనాల జాతర సందడి షురూ అయింది. ఆదివారం పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలతోపాటు నగరవ్యాప్తంగా భక్తులు ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. కూకట్పల్లిలో పరిధిలోని మూసాపేట్ చిత్తారమ్మ దేవాలయంలో మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సరన్ కుమార్, స్థానిక కార్పొరేటర్ మహేందర్ తో కలిసి  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్  మహేందర్, సాధు ప్రతాపరెడ్డి, శైలేష్, సత్యనారాయణ, నందనం దివాకర్, శేఖర్ గుప్తా, యాదగిరి, వినోద్, సాయి, ప్రశాంత్ రెడ్డి, నర్సింగ్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

సీసీ కెమెరాలతో నిఘా 
కాగా.. భాగ్యనగరంలో బోనాల జాతర సందర్భంగా లాల్ దర్వాజ బోనాలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సౌత్, ఈస్ట్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అలర్ట్ చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టి వాటిని బంజారాహిల్స్​లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​కు కనెక్ట్ చేశారు. లాల్ దర్వాజ మహంకాళి సింహవాహిని, అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు ఓల్డ్ సిటీలోని ఆలయాల వద్ద సుమారు 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయగా.. సిటీ సీపీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ పోలీసుల నిఘాతో పాటు సున్నితమైన ప్రాంతాల్లోని 134 ఆలయాల వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్​తో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్​ ఖర్గే కోరారు.