దళిత బంధు ఎవరికిచ్చారు

దళిత బంధు ఎవరికిచ్చారు
  • అబద్ధాలతో దళితులను మోసగిస్తున్న సీఎం​: వివేక్ వెంకటస్వామి
  • మూడెకరాల భూ పంపిణీ ఏమైంది?
  • దళిత బంధు ఎకరికిచ్చారు
  • శంషాబాద్ లో డప్పుల పంపిణీ

శంషాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి సవాల్​ చేశారు.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనం బీజేపీని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంత పాలనను, అవినీతి పాలన ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఓట్లతో ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సోమవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్​లో బీజేపీ మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య ఆధ్వర్యంలో బీజేపీ ఎస్సీ మోర్చా సమక్షంలో డప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. కేసీఆర్ కు దళితులపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. దళితులైన ఇద్దరు డిప్యూటీ సీఎంలను తొలగించారని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. అబద్ధాలతో దళితులను కేసీఆర్​ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు తీసుకువచ్చారని,  వీటిని పూర్తి చేసిన కాంట్రాక్టర్లు కోటీశ్వరులు అయ్యారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకే కేసీఆర్ దళిత బంధు స్కీమ్ ను తీసుకొచ్చారని,  రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ స్కీమ్​ను  అమలు చేయలేదని, టీఆర్ఎస్ నేతల వెంట తిరిగే వాళ్లకు మాత్రమే వర్తింపజేస్తున్నారని అన్నారు.  ‘‘కేసీఆర్  తన కుటుంబ సభ్యులకు పదవులు అప్పగించడం , ఆస్తులు పెంచుకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నరు. రాష్ట్ర ప్రజలపై కపట ప్రేమను చూపిస్తున్నరు. కేసీఆర్ తన స్థాయిని మరిచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తున్నరు. ఇది సరికాదు” అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, జుకల ఎంపీటీసీ బుక్క ప్రవీణ్, నాయకులు ప్రేమ్ రాజ్, సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్, ననావల కుమార్ యాదవ్, నరేందర్, పిసరి శ్రీనివాస్, పురుషోత్తం పాల్గొన్నారు.

దళితులకు ఇచ్చిన హామీలేమైనయ్​?
దళితులకు ఇచ్చిన ఎన్నో హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలోనే  ఏమీచేయని కేసీఆర్​..  ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తరు?” అని ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను మోడీ ఆదుకున్నారని, అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంతో  కొట్టుమిట్టాడుతున్నా ఇండియాను ఉన్నత స్థాయిలో నిలబెట్టారని అన్నారు. డప్పుల పంపిణీ వంటి మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన  చిటికెల వెంకటయ్యను అభినందిస్తున్నట్లు తెలిపారు. 150 గ్రామాల ప్రజల కోరిక మేరకు ప్రస్తుతం 150 అంబేద్కర్ విగ్రహాలను అందించామని,  అతి త్వరలో తన నియోజకవర్గం పెద్దపల్లిలో కూడా డప్పులు పంపిణీ చేస్తామని చెప్పారు.