సీఎం కేసీఆర్​పై వివేక్ వెంకటస్వామి ఫైర్

సీఎం కేసీఆర్​పై వివేక్ వెంకటస్వామి ఫైర్
  • కేసీఆర్​ను దింపాలని ప్రజలు కంకణం కట్టుకుంటున్నరు  
  • మరో తెలంగాణ ఉద్యమం అవసరం
  • నిర్మల్ బైక్ ర్యాలీలో పిలుపు 

నిర్మల్, వెలుగు: కేసీఆర్ పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసి తన కుటుంబానికి దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ, నియంతృత్వ పాలనతో ప్రజలంతా ఆవేదనతో ఉన్నారన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం నిర్మల్ లో వివేక్ వెంకటస్వామి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్ షో లో ఆయన మాట్లాడారు. మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారం నుంచి నిర్మల్ కు వచ్చానన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు ప్రజలే కంకణం కట్టుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరహాలో ప్రస్తుతం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయట్లేదని, తన కొడుకు, బిడ్డ, అల్లుడికి మాత్రం అవినీతి డబ్బుతో ఫామ్ హౌస్​లు కట్టిస్తున్నాడని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి రాకతో జిల్లాలో బీజేపీ బలం పుంజుకుందన్నారు.

ప్రశ్నించినందుకే నోటీసులు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే నాణేనికి ఉండే బొమ్మ, బొరుసు వంటివని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమన్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ తో కాంగ్రెస్ స్నేహాన్ని కొనసాగిస్తోందన్నారు. బీఆర్ఎస్ పట్ల  కాంగ్రెస్ విధానాలపై ప్రశ్నించినందుకే తనకు షోకాజ్ నోటీసు జారీ చేశారని, అందుకే బయటకు వచ్చానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు గంగిడి మనోహర్ రెడ్డి, అరవింద్ మీనన్, రమాదేవి, అయన గారి భూమయ్య, అప్పాల గణేష్, రావుల రామనాథ్, మెడిసిమ్మరాజు, రాజేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ

గంజాల్ టోల్ ప్లాజా వద్ద వివేక్ వెంకటస్వామికి, మహేశ్వర్ రెడ్డికి కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ సెయింట్ థామస్ స్కూల్ వరకు చేరుకోగా, అక్కడ వందలాది మంది కార్యకర్తలు భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ర్యాలీలో చేరారు. ర్యాలీ మంచిర్యాల చౌరస్తాకు చేరుకోగా, అక్కడ శివాజీ విగ్రహానికి వివేక్ వెం కటస్వామి, మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత ర్యాలీ అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివా ళులర్పించి ఇరువురు నేతలు మాట్లాడారు. అనంతరం ర్యాలీ పార్టీ ఆఫీసు వరకు సాగింది.