అగ్రంపహాడ్ జాతరలో ఇబ్బందులు తలెత్తొద్దు

అగ్రంపహాడ్ జాతరలో ఇబ్బందులు తలెత్తొద్దు

హనుమకొండ, వెలుగు: అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ లోని ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ స్నేహ శబరీశ్ తో కలిసి బుధవారం జాతర ఏర్పాట్లపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు చుట్టుపక్కల రైతులతో మాట్లాడి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. 

సంబంధిత రైతులకు రూ.5 వేల చొప్పున పరిహారం అందజేయాలన్నారు. 20వ తేదీన మరోసారి జాతర ఏర్పాట్లపై రివ్యూ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ అగ్రంపహాడ్ జాతర జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర అని, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

ఆలయ ఈవో నాగేశ్వర్ రావు మాట్లాడుతూ జాతర నిర్వహణకు దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో పరకాల ఆర్డీవో నారాయణ, పరకాల ఏసీపీ సతీశ్ బాబు, డీఎంహెచ్వో అప్పయ్య, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, పీఆర్ ఈఈ ఆత్మారాం, ఆర్టీసీ డీఎం ధరంసింగ్ తదితరులు పాల్గొన్నారు.