మహబూబాబాద్ టౌన్‌‌‌‌లో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి : ఎస్పీ శబరీశ్

మహబూబాబాద్ టౌన్‌‌‌‌లో  శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి : ఎస్పీ శబరీశ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మహబూబాబాద్ టౌన్‌‌‌‌లో మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని సర్పంచులు, వార్డ్ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్​ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, ప్రమాదాల ప్రధాన కారణాలు, నిర్లక్ష్యం వల్ల కలిగే ప్రాణ నష్టం గురించి వివరించారు. 

ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. "అరైవ్​ అలైవ్ " ప్రోగ్రాం ద్వారా సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. డ్రగ్స్, గంజాయితో యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటి నిర్మూలనకు ప్రజాప్రతినిధులు ముందుండాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 100, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్​లైన్ ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ లు తిరుపతి రావు, గండ్రతి మోహన్, కృష్ణ కిషోర్, పోలీస్​ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.