- ఎస్పీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో సంక్షేమ గురుకులాల రూపురేఖలు మారినాయని ఎస్పీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలో బుధవారం కలేక్టరేట్ లో భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీవోలు, జిల్లా కో ఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో వసతి గృహాలు నిర్వహణ, సౌకర్యాలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, విధుల నిర్వహణలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వసతి గృహాల విద్యార్థుల భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం, అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపకూడదని, వసతి గృహాల్లోకి బయటి వ్యక్తులు రానీయకూడదని స్పష్టం చేశారు. గురుకులాలు, హాస్టళ్ల వద్ద నిఘా పెంచుతామని ప్రైవేట్ సెక్యూరిటీతో రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని, షీ-టీమ్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ వసతి గృహాల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నుంచి రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
సమస్యలపై నివేదికలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీశ్, సత్య శారద, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్పీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంతు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
