ఆరేళ్ల పాలనలో హైదరాబాద్ ఏం మారలే

ఆరేళ్ల పాలనలో హైదరాబాద్ ఏం మారలే

హైదరాబాద్‌‌, వెలుగు: ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. శుక్రవారం కురిసిన వర్షాలతో సిటీలోని రోడ్లన్నీ పొంగి పొర్లాయని, చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌‌కు పరిపాలనపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఆంధ్రాపాలనలో వర్షాలు వస్తే హైదరాబాద్‌‌ రోడ్లపై  కార్లన్నీ ఓడలైపోతున్నాయని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక హైదరాబాద్‌‌ సిటీని బాగు చేసుకుందామని అప్పట్లో అన్నారని చెప్పారు. కేసీఆర్‌‌ సీఎం అయి ఆరేళ్లు అవుతోందనీ, ఆయన కొడుకు కేటీఆర్‌‌ మున్సిపల్‌‌ శాఖ మంత్రి అయి కూడా ఆరేళ్లు అవుతోందన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌‌ రోడ్లపై  వారికి ఓడలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌‌ ప్రజలు డ్రైనేజీలో వాష్‌‌ అవుట్‌‌ అవడం లాంటి ఘటనలతో కేసీఆర్‌‌ ది తుగ్లక్‌‌ పాలన అని స్పష్టమవుతోందన్నారు. సీఎంకు రాష్ట్రంలో రోడ్లు, డ్రైనేజీ బాగుండాలనే ఆలోచన లేదు కానీ సెక్రటెరియట్‌‌ ను కూల్చేసి వెయ్యికోట్లు ఖర్చుపెట్టి కొత్తగా కట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌‌కు పరిపాలనపై సోయి లేదని ఫామ్‌‌ హౌస్ కట్టుకోవడం, కమీషన్లు దోచుకోవడంపైనే ఆలోచన ఉందన్నారు. దీన్ని తెలంగాణ, హైదరాబాద్‌‌ ప్రజలంతా  గమనించాలని కోరారు.  వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్‌‌, కేటీఆర్‌‌కు సరైన గుణపాఠం చెప్పాలనిప్రజలను వివేక్‌‌ వెంకటస్వామి కోరారు.