ఆ రెండు సెగ్మెంట్లు జనసేనకు ఇవ్వొద్దు

ఆ రెండు సెగ్మెంట్లు జనసేనకు ఇవ్వొద్దు
  • శేరిలింగంపల్లి, కూకట్ పల్లి జనసేనకు కేటాయించొద్దంటున్న బీజేపీ నేతలు
  •  మీటింగ్​లు పెట్టి హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్న నాయకులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో జనసేన పొత్తులు చిచ్చు రేపుతున్నాయి. సిటీ శివారులోని శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాలు పొత్తులో భాగంగా జనసేన అడుగుతుండటంతో కమలం నేతలు కలవరపడుతున్నారు. పార్టీ బలంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను జనసేనకు ఇవ్వద్దని ఇక్కడి నేతలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 

శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు ఇవ్వొద్దని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఆ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు పలువురు బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు ఇవ్వాలనే ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని, హైకమాండ్ ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సమయంలో కూకట్ పల్లి సీటును కూడా  జనసేనకు ఇవ్వనున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో ఆ నియోజకవర్గం కమలం నేతలు ఆదివారం అత్యవసరంగా  సమావేశమయ్యారు. 

ఇక్కడ బలంగా ఉన్న బీజేపీని  కాదని, జనసేనకు ఎలా ఇస్తారని హైకమాండ్ ను ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతం కోసం గత కొన్నేండ్లుగా ఎంతో కష్టపడ్డామని, అధికార పార్టీ వేధింపులను తట్టుకొని పార్టీని నిలబెట్టామని వారు చెప్తున్నారు. హైకమాండ్ ఆలోచనను ఈ రెండు నియోజకవర్గాల కమలం లీడర్లు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.