
- ఆర్టీసీ కోటా దర్శన టికెట్ల రద్దుతో పడిపోయిన ఆదాయం
- అధికారులు ఎంత విజ్ఞప్తి చేసినా స్పందించని టీటీడీ
- తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒత్తిడి పెంచాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీరుతో తెలంగాణ ఆర్టీసీకి నష్టం కలుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత టీజీఆర్టీసీకి ప్రతిరోజూ కేటాయించే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను రద్దు చేశారు. ఈ నిర్ణయంతో టీజీఆర్టీసీ ఆదాయం పడిపోవడంతోపాటు తెలంగాణ ప్రజలకు వెంకటేశ్వరస్వామి దర్శనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో తెలంగాణ ఆర్టీసీకి టీటీడీ రోజుకు వెయ్యి చొప్పున రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను కేటాయించేది. ఈ టికెట్లను ఆర్టీసీ ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌తో పాటు రూ. 400కు అందించేది. ఇందులో రూ. 100 అదనపు రుసుముగా వసూలు చేసేది.
దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజూ 30 నుంచి 40 బస్సులు(ఏసీ, సూపర్ లగ్జరీ)నడిచేవి. ఈ సౌకర్యం వల్ల తిరుమల దర్శనం సులభంగా అందుబాటులో ఉండేది. ఫలితంగా ఆర్టీసీ బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. చాలామంది ఆర్టీసీ టికెట్ బుక్ చేసి, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి కూడా టీటీడీ దర్శనం పొందేవారు.అయితే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణతోపాటు కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల రవాణా సంస్థలకు దర్శన టికెట్ల కోటాను టీటీడీ రద్దు చేసింది.
రోజుకు 1,000 టికెట్లపై వచ్చే అదనపు ఆదాయం కోల్పోవడంతో పాటు తిరుపతికి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం తిరుపతికి వెళ్లే బస్సులకు ప్రయాణికుల డిమాండ్ బాగా తగ్గడంతో ఆర్టీసీ ఆదాయం కూడా పడిపోయింది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయంపై టీటీడీ ఈవోకు పలుమార్లు లేఖలు రాయడంతో పాటు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం చివరి ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. టీటీడీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.