దేశాన్ని సముద్రానికి వదిలేసి.. వలస వెళ్లిపోతున్న పబ్లిక్..

దేశాన్ని సముద్రానికి వదిలేసి.. వలస వెళ్లిపోతున్న పబ్లిక్..

యుద్ధాలు, హింస, పని దొరక్కపోవడం వల్ల తిండి కరువైనప్పుడు లేదంటే ఉన్నతమైన జీవితం కోసం వలసలు వెళ్తుంటారు. కానీ.. వీళ్లు మాత్రం పర్యావరణ మార్పుల వల్ల దేశం వదిలి వెళ్తున్నారు. తరతరాల నాగరికత.. పరిసరాలతో పెనవేసుకున్న బంధం.. ప్రాంతీయ అస్తిత్వం.. అన్నింటినీ సముద్రానికి వదిలేసి ఒకరిద్దరు కాదు ఒక దేశమంతా వలస వెళ్తోంది. బాధ్యత లేకుండా ప్రపంచం చేసిన తప్పులకు ఇప్పుడు తువాలు బలైపోతోంది. 

కొన్నేళ్ల నుంచి మనిషి విపరీత చేష్టల వల్ల వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయింది. దాంతో భూమి వేడెక్కి మంచు కరిగి నీటిగా మారుతోంది. ఆ నీటి వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. దాంతో తీర ప్రాంతంలోని భూభాగం సముద్రాల్లో కలిసిపోతోంది. ఈ సమస్యను సముద్రానికి ఆనుకుని ఉన్న దేశాలతోపాటు ఎన్నో ఐల్యాండ్స్ ఎదుర్కొంటున్నాయి. వాటిలో ముందువరుసలో ఉంది తువాలు. వాతావరణ మార్పుల వల్ల తుడిచిపెట్టుకుపోతున్న మొదటి దేశం ఇది. 

పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, హవాయిల మధ్య ఉన్న తొమ్మిది చిన్న చిన్న పగడపు దీవుల సమూహమే తువాలు. అక్కడివాళ్లు చేపల వేట, కొబ్బరి ఉత్పత్తులపై ఆధారపడి బతుకుతుంటారు. మొత్తం జనాభా సుమారు 11వేలు. దీని సగటు ఎత్తు సముద్ర మట్టానికి కేవలం 2 మీటర్లు మాత్రమే ఉంటుంది. అందువల్ల వరదలు, తుఫానులు, వాతావరణ మార్పుల ఎఫెక్ట్‌‌ దీనిపై చాలా ఎక్కువగా ఉంటుంది. తువాలు ఒక్కటే కాదు- కిరిబాటి, మాల్దీవులు, మార్షల్‌‌ ఐలాండ్స్‌‌ లాంటి ఎన్నో ద్వీపదేశాలు సముద్రమట్టాలు పెరగడం వల్ల ప్రమాదంలో పడుతున్నాయి. 

3 వేల ఏండ్ల చరిత్ర

వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో రెండో తక్కువ జనాభా కలిగిన దేశం తువాలు. దీని మొత్తం భూభాగం 25.14 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఈ దేశానికి వేల ఏండ్ల చరిత్ర ఉంది. మూడు వేల ఏండ్ల నుంచి ఇక్కడ మనుషులు ఉంటున్నారు. మొదటగా పాలినేషియన్లు సమోవా, టోంగా ప్రాంతాల నుంచి ఈ ఐల్యాండ్‌‌కు వలస వెళ్లారు. 16వ శాతాబ్దం వరకు దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. 1568లో స్పానిష్ అన్వేషకుడు అల్వారో మెండనా డి నెయ్రా తువాలుకు సముద్ర మార్గం కనుగొని ప్రపంచానికి పరిచయం చేశాడు. 

ఇంకో పాతికేళ్లు

నాసా ప్రకారం తువాలులో సముద్ర మట్టాలు గత 30 సంవత్సరాలతో పోలిస్తే 2023 నాటికి 15 సెం.మీ పెరిగాయి. ఆ లెక్కన 2050 నాటికి దేశంలోని సగం భూభాగం సముద్రంలో కలిసిపోతుంది. రాబోయే 80 ఏండ్లలో ఆ దేశంలోని 95శాతం భూభాగం నీటిలో మునిగిపోతుందని సైంటిస్ట్‌‌లు అంచనా వేస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఇప్పటికే తువాలులోని రెండు దీవులు నీళ్లలో మునిగిపో యాయి. అందుకే భవిష్యత్తులో రాబోయే ముప్పు నుంచి తప్పించుకో వడానికి తువాలు ప్రజలు ప్రణాళికాబద్ధంగా వలస వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. 

ఇలా ఒక దేశం మొత్తం వలస వెళ్లడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిది. అందుకే తువాలు గవర్నమెంట్‌‌ భావితరాలకు దాని సాంస్కృతిక వారసత్వం గురించి తెలిసేలా ‘డిజిటల్‌‌ నేషన్‌‌ ఇనీషియేటివ్‌‌’ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అక్కడి ఇండ్ల నుంచి చెట్ల వరకు ప్రతిదానిని డిజిటల్‌‌గా బ్యాకప్ చేస్తోంది. 

ఫలేపిలి ఒప్పందం

తువాలు, ఆస్ట్రేలియాలు 2023లో ఫలేపిలి యూనియన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ సంవత్సరం క్లైమెట్‌‌ మైగ్రేషన్‌‌ ప్రోగ్రామ్‌‌ని మొదలుపెట్టాయి. దాని ప్రకారం.. సంవత్సరానికి 280 మంది తువాలు ప్రజలకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఇస్తుంది. వాళ్లకు ఆస్ట్రేలియన్లలాగే సంక్షేమం, శాశ్వత నివాసం, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉద్యోగాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ సంవత్సరం మొదటి విడతలో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు 8,750 మంది అప్లై చేసుకున్నారు. 

అంటే దేశంలోని దాదాపు 80 శాతం మంది వలస వెళ్లడానికి రెడీ అయ్యారు. వాళ్లలో 280 మందిని మాత్రమే లాటరీ ద్వారా ఎంపిక చేసి, వీసాలు ఇస్తారు. దేశ జనాభా మొత్తాన్ని తరలించడానికి మరో 30 నుంచి 40 సంవత్సరాలు పట్టొచ్చు. అమెరికా కూడా ఈ మధ్యే వీసా నిషేధిత దేశాల జాబితా నుంచి తువాలును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 


బ్రిటిష్‌‌ పాలనలో.. 

ఈ దీవులను సందర్శించిన బ్రిటిష్ ఎంపీ ఎడ్వర్డ్ ఎల్లిస్ పేరు మీద 1819లో వీటికి ‘ఎల్లిస్‌‌ ఐల్యాండ్స్‌‌’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత ఇది బ్రిటిష్‌‌ పాలనలోకి వెళ్లింది. 1892లో బ్రిటిష్ ప్రొటెక్టరేట్‌‌లో భాగమైంది. దీని పక్కనే ఉన్న గిల్బర్ట్‌‌ దీవులతో ఎల్లిస్ దీవులను కలిపి ఒక కాలనీగా ఏర్పాటు చేశారు. 1974లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ రెండింటినీ వేర్వేరు కాలనీలుగా విభజించారు. అప్పుడే వాటి పేర్లు కూడా కిరిబాటి, తువాలుగా మార్చారు. తువాలు అంటే ‘ఎనిమిది ద్వీపాల సమూహం’ అని అర్థం. 

అప్పట్లో తువాలులోని ఎనిమిది ద్వీపాల్లో మనుషులు ఉండేవాళ్లు. అందుకే ఆ పేరుపెట్టారు. 1978లో తువాలు బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అదే సంవత్సరం కామన్వెల్త్‌‌లో సార్వభౌమ రాజ్యంగా గుర్తింపు తెచ్చుకుంది. చార్లెస్ –3 తువాలు రాజుగా కొనసాగాడు. 2000లో  ఇది  యూఎన్‌వో 189వ సభ్య దేశంగా చేరింది. 

కార్మికులుగా..

ఆస్ట్రేలియా, ఫిజిల్లో పనిచేసేందుకు బలవంతంగా ఇక్కడి నుంచి కార్మికులను తరలించేవాళ్లు. 1863 ఒక్క సంవత్సరంలోనే 400 మందిని తీసుకెళ్లారు. ఆ టైంలోనే యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన అంటువ్యాధుల వల్ల ఐల్యాండ్‌‌ జనాభా బాగా తగ్గిపోయింది. 

చిన్న ఆర్థిక వ్యవస్థ

ఈ దీవుల్లో నేల ఎక్కువగా లేదు. కాబట్టి కావల్సిన పంటలు పండించుకోలేరు. అందుకే దిగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడతారు. చేపలు పట్టి, వాటిని ఎక్స్‌‌పోర్ట్ చేసి డబ్బు సంపాదిస్తారు. అంతర్జాతీయ కంపెనీలకు ఫిషింగ్ పర్మిట్లు ఇవ్వడం, కార్గో షిప్‌‌ల్లో పనిచేసే తువాలు నావికుల నుంచి దేశానికి ఆదాయం వస్తుంది. వనరుల కొరత, మారుమూల దేశం కావడంతో తువాలు ఆర్థికంగా ఎదగలేకపోయింది. ప్రపంచంలోని అతి చిన్న ఆర్థిక వ్యవస్థల్లో ఇది ఒకటి. దాని జీడీపీ 42.59 మిలియన్‌‌ అమెరికన్ డాలర్లు. తువాలుకు స్టాండింగ్ ఆర్మీ కూడా లేదు. అంతెందుకు ఏటీఎంలు కనిపెట్టి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా తువాలులో మొన్నటివరకు ఒక్క ఏటీఎం కూడా లేదు. ఈ ఏడు ఏప్రిల్‌‌ 15న ఆ దేశంలో మొదటి ఏటీఎం సర్వీసుని ప్రారంభించారు. 

నో క్రెడిట్‌‌ కార్డు

తువాలులో ఇప్పటికీ క్రెడిట్‌‌ కార్డు పేమెంట్స్‌‌ని యాక్సెప్ట్‌‌ చేయడంలేదు. దేశంలో ఏం కొనాలన్నా నగదు ఇవ్వాల్సిందే. వాళ్లకు ప్రత్యేకంగా కరెన్సీ కూడా లేదు. ఆస్ట్రేలియన్‌‌ డాలర్‌‌‌‌నే వాడతారు. అక్కడికి ఎవరైనా వెళ్తే ఉండడానికి ఒక హోటల్, ఒక గెస్ట్ హౌస్ మాత్రమే ఉన్నాయి. 

అన్నీ పగడపు దీవులే

ప్రపంచంలో చాలా ద్వీప దేశాలు ఉన్నాయి. కానీ.. నాలుగు దేశాలు మాత్రమే పూర్తిగా పగడపు దీవులతో ఏర్పడ్డాయి. వాటిలో తువాలు ఒకటి. సాధారణంగా సముద్రంలో ఉన్న అగ్నిపర్వతాల చుట్టూ పగడపు దిబ్బలు ఏర్పడతాయి. కాలక్రమేణా అగ్నిపర్వతం క్షీణించినప్పుడు పగడపు దిబ్బలు ద్వీపాలుగా ఏర్పడతాయి. తువాలు ద్వీపాలు కూడా అలా ఏర్పడినవే. 

వీసా లేకుండా..

ప్రపంచంలోని చాలా దేశాలు తువాలుకు వీసా లేకుండా వెళ్లొచ్చు. అక్కడికి వెళ్లాక వీసా తీసుకోవచ్చు. ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా చాలా తక్కువ. సంవత్సరా నికి సుమారు 3,000 మంది మాత్రమే వెళ్తుంటారు.