న్యాయవాదులు, న్యాయమూర్తుల్లో కవులు, రచయితలు తక్కువ. రావి శాస్త్రి, బీనాదేవి, జింబో, నందిగం కృష్ణారావు లాంటి వాళ్లు తెలుగు రచయితల్లో ప్రముఖులు. సంఖ్య తక్కువ అయినా బలమైన రచనలు చేశారు.
మన దేశంలో కూడా వీళ్లు తక్కువే అని చెప్పొచ్చు. కానీ, చాలామంది న్యాయవాదులు, న్యాయమూర్తులకి సాహిత్యం అంటే మక్కువ.. సాహిత్యం మీద ఇష్టం ఉన్న న్యాయవాదులు కోర్టుల్లో వాదనలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో కవితాచరణాలను ఉదహరిస్తూ ఉంటారు. మరి కొంతమంది చిన్న కథలనూ ఉదహరిస్తూ ఉంటారు.
వాదనలలోనే కాదు, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి మధ్యన జరిగే సంభాషణల్లో కూడా కథలు, కవిత్వం అప్పుడప్పుడూ వస్తాయి. ఓ చిన్న కథ, కవిత్వం చేసే పని ఓ గంట ఉపన్యాసం కన్నా ఎక్కువ. ఒక గంట ఉపన్యాసంలో చెప్పే విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా ఓ చిన్న కథలో చెప్పవచ్చు. కథకి కొంత సమయం పడుతుంది. కవిత్వానికి అంత సమయం పట్టదు.
ఏ విషయం గురించైనా ఎంత సూటిగా, శక్తివంతంగా చెప్పామనేది ముఖ్యం. అందుకోసం కొంతమంది కథను ఎంచుకోవచ్చు. మరికొంతమంది కవితా చరణాలని ఎంపిక చేసుకోవచ్చు.న్యాయమూర్తులు కూడా ఒక విషయాన్ని బలంగా చెప్పడం కోసం కవితా చరణాలను ఎంపిక చేసుకుంటారు. న్యాయమూర్తులకి కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి మాటల రూపంలోనే కాదు, తీర్పుల్లో కూడా వ్యక్తం అవుతూఉంటాయి. అందుకు వారు ఎంపిక చేసుకునే ప్రక్రియ కవితా చరణాలు.
కొన్ని సందర్భాల్లో ఓ కథలోని కొన్ని పేరాలు, వాక్యాలు, తీర్పుల్లో కవితా చరణాల గురించి మరోసారి చర్చిద్దాం. ఈసారి కోర్టుల్లో వాదనలు జరిగే క్రమంలో జరిగిన కవితా చరణాలని, కథలని, వాక్యాలని పరిశీలిద్దాం. కోర్టుల్లో కథల్లోని వాక్యాలని, కవితా చరణాలని ఉదహరించేటప్పుడు న్యాయవాదులు తీసుకునే సమయం తక్కువగా ఉండాలి. అంతేకాదు అవి విషయానికి దగ్గరగా, సూటిగా ఉండాలి. అప్పుడే వాటిని న్యాయమూర్తులు వినడానికి ఇష్టపడతారు. వాళ్ళ కేసుకి సంబంధించిన అంశానికి సంబంధించినదై వుండాలి. కవితా చరణాలను చెప్పి తమకి అనుకూలంగా ఉన్న ఉత్తర్వులని పొందే అవకాశం ఉంటుంది.
ఢిల్లీ హైకోర్టులో ఓసారి జరిగిన ఓ సంఘటనని ఉదహరిస్తాను. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ అప్పుడు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. నాజిమ్ వాజిరి న్యాయవాది. ఆయన కేసులో చాలా దూరంగా తేదీని ఇచ్చి న్యాయమూర్తి లంచ్కి బెంచీ దిగి వెళ్తున్న క్రమంలో ఆ న్యాయవాది ఓ ఉర్దూ కవితలోని రెండు చరణాలని ఇలా చదివాడు.
‘‘కౌన్ జీతా హై
తేరీ జుల్ఫ్ సర్ హెూనే తక్’’
‘‘నీ ప్రతిస్పందన కోసం అంతకాలం నేను వేచి ఉండలేను’’ అన్నది దాని సారాంశం.
న్యాయమూర్తి ఠాకూర్ మళ్ళీ బెంచీ మీదకు వచ్చి ఆ కవితలోని మొదటి చరణాలను చదవమని అడిగారు. అతను ఇలా చదివాడు.
‘ఆకో బాహీయే
ఇక ఉమ్ అసర్ హెూనే టక్’
‘ప్రియురాలి నుంచి ప్రేమ పూర్వకమైన జవాబు రావడానికి చాలా సమయం పడుతుంది’ అన్నది తెలుగు సారాంశం.ఈ కవితా చరణాలని విన్న న్యాయమూర్తి కేసుని దగ్గరగా అంటే ఆ వచ్చేవారానికే వేశాడు.
అదేవిధంగా ఓసారి ఓ న్యాయమూర్తి ఓ న్యాయవాది అప్పీలుని వింటూ షేక్స్పియర్ హెన్రీ–6 లోని వాక్యాలని ఉదహరించాడు. ఆ న్యాయవాది చెడు ప్రవర్తన గురించిన అప్పీలు అది. ఆ న్యాయవాది ప్రవర్తన నుంచి విసుగు చెందిన న్యాయమూర్తి ఇలా అంటాడు.
‘‘మనం చెయ్యాల్సిన మొదటి పని న్యాయవాదులను చంపి వేయడం’’ ఇది షేక్స్పియర్ మాట.
న్యాయమూర్తులు, న్యాయవాదులు వాద, ప్రతివాదనలు వినిపిస్తున్న క్రమంలో కవితలని, వాక్యాలని ఉదహరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉదహరించడం వల్ల న్యాయమూర్తుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అదే విధంగా ఒక విషయంలో న్యాయమూర్తుల దృక్పథాలని మార్చే అవకాశం కూడా ఉంది.
కథల్లోని వాక్యాలు చెప్పినప్పుడు పేచీ లేదు. అవి సులువుగానే అర్థమవుతాయి. కవిత్వం అలా కాదు. అందుకని స్పష్టత ఉన్న కవితా చరణాలని ఉదహరించాల్సి ఉంటుంది.
అయితే అందరు న్యాయమూర్తులు ఈ కవితా చరణాలు వినడానికి ఇష్టపడతారని కూడా చెప్పలేం. కొంతమంది ఇష్టపడకపోవచ్చు. చాలామంది న్యాయమూర్తులకి ఉర్దూ భాష పట్ల ఇష్టం ఎక్కువ. తెలుగు రాష్ట్రాలలో తెలుగుని, తెలుగులోని కవిత్వాలని, కథలని, వాక్యాలని ఉదహరించి న్యాయమూర్తుల దృష్టిని ఆకర్షించవచ్చు. అయితే అలాంటి సందర్భాలు నా దృష్టికి తక్కువగా వచ్చాయి.
ఉర్దూ కవితలని, ఇంగ్లీషు కవితలని ఉదహరించిన చాలా తీర్పులను నేను చూశాను. అదేవిధంగా తమిళ సినిమా పాటలని ఉదహరించిన తీర్పులని చూశా. కానీ, తెలుగు కవితలని, తెలుగు కథల్లోని వాక్యాలను ఉదహరించిన తీర్పులు నా దృష్టికి రాలేదు.
కానీ, న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు నా కథలోని చివరి వాక్యాలని బెంచీ మీద రెండు మూడు సందర్భాల్లో ఉదహరించారని న్యాయవాద మిత్రులు చెప్పారు. ఆ కథ పేరు ‘మొన్న నిన్న నేడు రేపు’.మద్యపాన నిషేధం ఉన్న రోజుల కాలం కథ అది. ఓ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎల్లయ్య హోటల్ ఉంటుంది. అప్పటికింకా మద్యపాన నిషేధం రాలేదు.
తెలంగాణ ప్రాంతంలో సారా అమ్మకాలు చేపట్టవద్దని నక్సలైట్లు ఓ ఫర్మానాని జారీ చేశారు. నక్సలైట్లకి భయపడి సారా అమ్మడాన్ని అందరూ ఆపేశారు. ధిక్కారాన్ని సహింతునా అని ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సారా పొట్లాలు పెట్టి అమ్మించింది. సారా అమ్మడమే తమ జీవిత ధ్యేయంగా పోలీసులు మారిపోయారు.
ఎల్లయ్యకి ఇవ్వాల్సిన డబ్బుకి గాను సారా పొట్లాలు ఇచ్చేవాళ్లు పోలీసులు. ఆ విధంగా సారాకి అలవాటయ్యాడు ఎల్లయ్య. ఎల్లయ్య హోటల్ కాస్త రెడ్డి మిలటరీ హెూటల్గా మారిపోయింది.
సంపూర్ణ మధ్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. తాగుడుకి అలవాటైన ఎల్లయ్య ఉరఫ్ ఎల్లారెడ్డికి ఏమీ ఫరక్ పడలేదు. డబ్బులిచ్చి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ సంపాదించి తాగేవాడు. ఆ తరువాత లైసెన్స్లు కూడా రద్దయ్యాయి. ఎల్లారెడ్డి-కి కష్టకాలం మొదలవుతుంది. పోలీసులకీ అయనకూ పడదు. మందుబాటిళ్లు దొరికాయన్న కేసులో ఎల్లారెడ్డి ఇరుక్కొని జైలుకి వెళ్తాడు. ఆ తరువాత మందు మానేస్తాడు. ఆ తరువాత నిషేధం ఎత్తేస్తారు.
‘మందు కొనండి– ప్రభుత్వాన్ని రక్షించండి’ అన్న ప్రకటనలు వచ్చేస్తాయి. ఈ మార్పులన్నింటినీ చూసి ఎల్లారెడ్డి మనస్సు బుడ్డీ వైపు లాగడం మొదలవుతుంది. కానీ, జైలు జీవితం గుర్తుకొస్తుంది. మొన్న అలవాటు లేనప్పుడు బలవంతం పెట్టి కొనిపిచ్చారు. అలవాటు చేశారు. అన్నీ అలవాటైన తరువాత చాటుకు తాగినా కూడా కేసు పెట్టారు. డబ్బులు గుంజారు. ఈ రోజు మానేద్దామనుకుంటే నేరం కాదంటున్నారు. మొన్న నేరం కాదు. నిన్న నేరం. ఈ రోజు నేరం కాదు.. ఇదేమీ న్యాయమో ఎల్లారెడ్డికి అర్థం కాదు. రేపు సీసా దగ్గర లేకపోతే నేరం అంటారేమోనని భయం వేస్తుంది. ఎందుకైనా మంచిదని తన హోటల్ని అక్కడినుంచి వేరే ప్రాంతానికి తరలిస్తాడు. ఇదీ కథ.
సాహిత్యం చదివే వాళ్ళు తక్కువ కావొచ్చు. కానీ ఆనందించే వాళ్ళు ఎక్కువే.
డా. మంగారి రాజేందర్
కవి, రచయిత
9440483001
NOTE : లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
