
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సి. చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (67) అధికారికంగా ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ గతంలో తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా, జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఇచ్చింది. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ.
ప్రస్తుతం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఒక ఖాళీ స్థానం ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఐదు ఖాళీలు ఉన్నాయి. ఉభయ సభల్లో ప్రస్తుతం 782 మంది సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో ఎన్డీయేకు 542 మంది సభ్యులలో 293 మంది సభ్యులు ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ తో ప్రస్థానం..
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించాడు. 16 ఏండ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జన్ సంఘ్, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998,1999లో బీజేపీ ఎంపీగా గెలిచి... 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పని చేశారు.
2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పని చేయగా, ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిసై పని చేశారు. 2024 మార్చి నుంచి 2024 జూలై వరకు తెలంగాణకు అదనపు గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్రకు 24వ గవర్నర్‌గా ఉన్నారు.