ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

న్యూఢిల్లీ: అధికార ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‎ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆదివారం (ఆగస్ట్ 17) ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది.

ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్, పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అనంతరం ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‎గా పని చేస్తోన్న సీపీ రాధాకృష్ణన్ పేరును ఫిక్స్ చేశారు. అనంతరం ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అఫిషియల్‎గా ప్రకటించారు. 

సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‎గా పని చేస్తున్నారు. గతంలో ఈయన తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్‎గా కూడా పని చేశారు. సీపీ రాధాకృష్ణన్‎ స్వస్థలం తమిళనాడు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సౌత్‎లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ సీపీ రాధాకృష్ణన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో తమ ఉనికిని చాటు చాటుకుని దక్షిణాలో బలపడాలని కాషాయ పార్టీ ముమ్ముర ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో సీపీ రాధాకృష్ణన్ ఎంపిక ఆ పార్టీకి కలిసి రానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

జగదీప్ ధన్‎ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. 2025, సెప్టెంబర్ 9న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎన్నిక జరగనుంది. ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమికి కావాల్సిన బలం ఉండటంతో ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనం కానుంది. సంఖ్యా బలం లేని కారణంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించుతుందో లేదో చూడాలి.