
పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తున్నారా.. స్క్రీన్ సమయం పెరిగితే పిల్లల్లో కేవలం మానసిక ఆరోగ్యం, కంటిచూపుపైనే కాదు గుండు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. ముఖ్యంగా భారతీయ కుటుంబాల్లో దీని ప్రభావం ఎక్కువఅని తెలుస్తోంది. ఎందుకంటే మనదేశంలో ప్రత్యేకించి 2020లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమైన తర్వాత స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగింది.
ఈ అధ్యయనం డెన్మార్క్‌లో 1,000 కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు,పిల్లలపై జరిగింది. స్క్రీన్ సమయం ప్రతి అదనపు గంట పెరిగితే, 6నుంచి 10 ఏళ్ల పిల్లలలో ,కౌమారదశలో ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరిగిందని అధ్యయనం చెబుతోంది.
అధ్యయనం ప్రకారం.. తక్కువ లేదా ఆలస్యంగా నిద్రపోయే పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. స్క్రీన్ సమయం వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించడంలో నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.స్క్రీన్ సమయం శరీరంలోని జీవక్రియల మార్పులకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ ను సృష్టిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే జీవసంబంధమైన సంకేతాన్ని సూచిస్తుంది. ఈ "ఫింగర్ ప్రింట్" ఆధారంగా కౌమారదశలో ఉన్నవారిలో 10 సంవత్సరాల తర్వాత గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు.
భారతీయ కుటుంబాలపై ప్రభావాలు
ఈ అధ్యయనం భారతీయ కుటుంబాలకు ఎందుకు ముఖ్యమైనదో ఇక్కడ అధ్యయనం వివరించింది. భారతదేశంలో పిల్లలు తమ రోజులో ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గేమింగ్‌తో గడుపుతున్నారు. ఇది వారి జీవనశైలిని మార్చి, శారీరక శ్రమను తగ్గిస్తుంది.స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతి (Blue light) మెదడును చురుకుగా ఉంచుతుంది.ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. తక్కువ నిద్ర వలన జీవక్రియలో సమస్యలు, ఊబకాయం ,మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి.
స్క్రీన్ సమయం పెరగడం వల్ల పిల్లలు కదలకుండా ఉంటారు.దీని వలన ఊబకాయం, రక్తపోటు ,కొలెస్ట్రాల్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఎక్కువ స్క్రీన్ సమయం ఉన్న పిల్లలు అనారోగ్యకరమైన చిరుతిండి (junk food) తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు.ఇది గుండె ఆరోగ్యానికి హానికరం.
పరిష్కారాలు..
పిల్లల గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కొన్ని సులభమైన మార్గాలు:
స్క్రీన్ సమయానికి షెడ్యూల్..పిల్లలకు రోజుకు ఎంత సమయం స్క్రీన్ ఉపయోగించాలో నిర్ణయించండి. హోంవర్క్ లేదా ఆన్‌లైన్ క్లాసులు తప్ప, మిగతా సమయాన్ని ఆటలు లేదా ఇతర కార్యకలాపాలకు కేటాయించాలి.
మంచి నిద్ర అలవాట్లు..పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు పిల్లలు ఫోన్లు, టీవీలు, టాబ్లెట్‌లకు దూరంగా ఉండేలా చూడాలి. దీని వల్ల వారు త్వరగా,ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.
శారీరక శ్రమను ప్రోత్సహించాలి.. పిల్లలను ఇంట్లోనే కాకుండా, బయట ఆడటానికి ప్రోత్సహించాలి..ఇది వారి గుండె ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది.
కుటుంబంతో సమయం గడపాలి.. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం లేదా ఇంట్లోని పనుల్లో సహాయపడటం వంటివి చేయాలి. ఇది స్క్రీన్ సమయాన్ని తగ్గించడంతో పాటు, కుటుంబ సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది.
చివరిగా పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం వారి ప్రస్తుత అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులు వారి హృదయాలను రాబోయే దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.